తిరుమలలో ఇటీవల రవికుమార్ అనే ఉద్యోగి విదేశీకరెన్సీని దొంగతనం చేసేవారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారం అలా ఉండాగనే పరకామణి నుంచి బంగారాన్ని దొంగతనం చేస్తున్న మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతను ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పరకామణిలో ఉద్యోగం సంపాదించారు. వంద గ్రాముల బంగారం బిస్కెట్ను చెత్త తరలించే వాహనం ట్రాలిలో పెట్టి బయటకు తరలిస్తూండగా కనిపెట్టిన భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. తర్వాత అతని ఇంట్లో సోదాలు చేశారు. దీంతో రూ. 46 లక్షల విలువైన బంగారం దొరికింది.
రెండేళ్ల కిందట పలువురు కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల్లో టీటీడీలో చేరారు. వీరంతా ఇలా శ్రీవారి హుండీ డబ్బులు కూడా కొట్టేస్తున్నారు. తాజాగా వీరందరిపై ప్రత్యేకంగా నిఘా వేసి పట్టుకుంటున్నారు. ఇలా ఇంకా ఎంత మంది దొంగలు ఉన్నారో.. ఎలా బయటకు తీసుకెళ్తున్నారో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అందరిపై నిఘా పెట్టారు. శ్రీవారి భక్తులు ఎంతో నమ్మకంతో హుండీలో డబ్బులు వేస్తూంటారు. తమ సొమ్ము శ్రీవారికి చెందాలని అనుకుంటారు. కానీ ఇలాంటి దొంగలు మాత్రం మధ్యలో కొట్టేయడానికి వెనుకాడటం లేదు.
దేవుడంటే.. భయం, భక్తి లేని వారిని ఉద్యోగాల్లోకి ఎలా తీసుకున్నారో కానీ.. వారు దేవుడి దోపిడీ చేయడానికి వదిలి పెట్టడం లేదు. ఇక నుంచి ఇలా పరకామణి సహా పూర్తి స్థాయిలో నగదు వ్యవహారాలతో సంబంధం ఉన్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టి.. దోపీడీలు చేసే వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లుగా ఎంత దోపిడీ చేశారో కానీ.. ఇప్పడే అన్నీ బయట పడుతున్నాయి.