అమరావతి ఉద్యమకారులు ఐదు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు… వార్షికోత్సవాలు జరుపుకోవడమే కానీ.. ఇంత వరకూ.. వారికి పిసరంతగుడ్ న్యూస్ లభించలేదు. పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణచేయవద్దంటూ వారు ఉద్యమం ప్రారంభించి వంద రోజులు అయింది. శతదిన ఉద్యమసభలు జరుపుకుంటున్నారు కానీ.. వారికి కూడా ఇంత కూడా… శుభవార్త అందడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ అమ్మి తీరుతామనే … ప్రకటనలే ఎదురు వస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్ను వంద శాతం ప్రైవేటీకరించాలని అంటే అమ్మేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న విషయం… వంద రోజుల కిందట బయటపడింది. అంతకు ముందే నిర్ణయాలు తీసుకుని ప్రక్రియ కూడా ప్రారంభించారని ఆ తర్వాత బయటపడింది. కొన్ని సంస్థలు ఆసక్తి చూపించాయని.. వారు వచ్చి ప్లాంట్ను పరిశీలించి వెళ్లడం కూడా జరిగిందని .. అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని.. పార్లమెంట్లో ప్రశ్నలు సంధించిన వైసీపీ ఎంపీలు… వెలుగులోకి తెచ్చారు. ఈ పరిణామాలన్నింటితో ఉద్యమం మరింత తీవ్రమయింది. అంతలోనే కరోనా సెకండ్ వేవ్ రావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.
స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ నుంచి రైతు సంఘాల నేతల్ని పిలిపించి సభలు పెడుతున్నారు. వారికి మొదట్లో ప్రజల మద్దతు కూడా లభించింది. ఇప్పుడు… కరోనా కారణంగా ఉద్యమాలు చేయలేని పరిస్థితి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి కావడంతో మరోసారి .. ప్రాణం అందిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయవద్దన్న నినాదాన్ని వినిపించగలిగారు. కానీ.. అది కూడా.. ఇప్పుడు సైలెంటయ్యే పరిస్థితి. అమరావతి రైతులకు లేని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులకు ఉన్న అడ్వాంటేజ్ ఒక్కటే. అంతర్గతంగా కాకపోయినా.. బహిరంగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.
కానీ అవేమీ పని చేయవని.. రాజకీయంగా లబ్దిపొందడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా చూసినా… అమరావతి రైతులు.. స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు… అలా ఉద్యమాలు చేస్తూనే ఉండాలి. భగవద్గీతలో చెప్పినట్లు..కష్టపడు ఫలితం ఆశించకు అన్నదాన్ని.. ఉద్యమాలు చేయి.. ఫలితాలు ఆశించకు.. అన్నట్లుగా వారు పోరాడాల్సిన పరిస్థితి. ఫలితం ఉంటుందో లేదో కూడా అంచనా వేయలేని దుస్థితి.