హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏపి ఉద్యోగులు విజయవాడ తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతుంటే ఆకస్మికంగా మరో అవరోధం ఎదురైంది. వారు ఆంధ్రాకి తరలిరావడానికి స్థానికత అంశం కూడా ఒక అవరోధంగా ఉంది కనుక జూన్ 2, 2017లోగా ఆంధ్రాకి తరలివచ్చే వారినందరినీ స్థానికులుగానే పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హామీ ఇచ్చింది. దాని కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)కి అనుగుణంగా 1975లో జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2015 అక్టోబరులో కేంద్రానికి లేఖ కూడా వ్రాసింది. ఆ అభ్యర్ధనను కేంద్ర హోం మరియు న్యాయశాఖలు పరిశీలించిన తరువాత అది చెపుతున్న కారణాలు సహేతుకంగానే ఉన్నందున సవరణలని సిఫార్సు చేస్తూ ప్రధానికి లేఖ వ్రాశాయి. కేంద్ర క్యాబినెట్ కూడా దానిని ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. ఇకనేడో రేపో అది ఆమోదం పొందుతుందని అందరూ భావిస్తున్న సమయంలో తెలంగాణా ప్రభుత్వం దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
కేంద్రప్రభుత్వం చేయబోతున్న ఆ చట్ట సవరణ వలన తమ రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు వస్తాయో తెలియదు కనుక కొంత కాలం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి, అది తయారు చేసిన ముసాయిదా కాపీని తమకు పంపినట్లయితే, దానిని పరిశీలించి, ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉన్నట్లయితే తెలియజేస్తామని తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి ఒక లేఖ వ్రాశారు. కనుక స్థానికత అంశంపై చట్ట సవరణ చేయడానికి మరికొంత సమయం పట్టవచ్చు.
ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం దీనిపై కొత్తగా ఏదైనా మెలిక పెట్టినట్లయితే, అది కూడా మరో పెద్ద సమస్య కాగలదు. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలనే తెలంగాణా ప్రభుత్వం కూడా కోరుకొంటోంది కనుక అది చట్ట సవరణకు బహుశః అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ ఈ సమస్య పరిష్కారం అయితే గానీ ఉద్యోగులు విజయవాడకి రామని మొండికేసినట్లయితే మళ్ళీ వారికీ, ప్రభుత్వానికి మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. కనుక అటువంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచించక తప్పదు.