తెలుగు నిర్మాతల మండలి ఇటివలే ఓ కీలక నిర్ణయం తీసుకొంది. ఈ సంక్రాంతికి తెలుగులో డబ్బింగ్ సినిమాలకు అనుమతి లేదని తీర్మానించింది. ఈ నిర్ణయం నిర్మాత దిల్ రాజుకి చిక్కు తెచ్చింది. ఆయన విజయ్ హీరోగా నిర్మిస్తున్న `వారసుడు` సినిమాని ఈ సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది ద్విభాషా చిత్రమని చెబుతున్నా.. తమిళంలో తీసి తెలుగులో డబ్ చేశారన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయంతో.. వారసుడు సంక్రాంతి విడుదలకు బ్రేక్ పడినట్టైంది.
అయితే ఇప్పుడీ వివాదం మరింత ముదురుతోంది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు కాకుండా తెలుగు సినిమాల కు ప్రాధాన్యత నివ్వాలి అని తెలుగు నిర్మాతల మండలి నిర్ణయంపై తమిళ దర్శకులు అసహనం వ్యక్తం చేశారు. తెలుగు సినిమాలను ఇక్కడ అదరిస్తుంటే తమిళ్ సినిమాలను అపడం ఏమిటంటు తమిళ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది.తాము కూడా తెలుగు సినిమాలను అడ్డుకుంటామని నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ నెల 22న తమిళ్ నిర్మాతల భేటీ కానుంది. ఈ భేటిలో వారసుడు వివాదం చర్చ జరగనుంది. అయితే ఈ వివాదం ఇప్పటివరకూ దిల్ రాజు పెదవి విప్పకపోవడం గమనార్హం.