తెలుగు360 రేటింగ్ 2.75/5
స్టార్లు ఎవరూ లేకపోయినా… చిన్న సినిమాలే అయినా… కొన్ని కొన్ని విడుదలకి ముందే ఆసక్తి పెంచుతుంటాయి. చూడాలనే ఆత్రుతని కలగజేస్తుంటాయి. అందుకు కారణం… ఆయా సినిమాల ప్రమోషన్లే. టీజర్లు, ట్రైలర్లతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేయొచ్చని ఈమధ్య చాలా సినిమాలే నిరూపించాయి. పైపెచ్చు ఇటీవల చిన్నసినిమాని ఎవ్వరూ చిన్నచూపు చూడటం లేదు. అర్జున్‌రెడ్డి , ఆర్.ఎక్స్.100 వంటి సినిమాలు సాధించిన విజయాలే అందుకు కారణం. పరిమిత వ్యయంతోనే సినిమాలు తీసి, పెద్ద స్థాయిలో విడుదల చేసే బెక్కెం వేణుగోపాల్ నిర్మాణంలో `హుషారు` రూపొందడం… ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించడంతో సినిమాకి మంచి బజ్జే క్రియేట్ అయ్యింది. మరి సినిమా అందుకు తగ్గట్టుగా ఉందో లేదో తెలుసుకొందాం పదండి.
కథ
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొన్న బ్యాడ్ బాయ్స్ ఆర్య (తేజస్ కంచర్ల), చెయ్ (అభినవ్), బంటి (తేజ్ కూరపాటి), ధ్రువ్ (దినేష్ తేజ్). ఎప్పటికీ స్నేహితులుగానే ఉండాలని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోతారు. దాంతో పెద్దయ్యాక కూడా కలిసి మెలిసి అల్లరి చేస్తుంటారు. ఇంట్లో రోజూ చీవాట్లు తింటూనే బయటికొస్తుంటారు. తమకి నచ్చినట్టుగానే జీవించాలనుకుంటుంటారు. ఇంతలో చెయ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమెతో అభిప్రాయ బేధాలు రావడం విడిపోతాడు. ఆ బాధలో ఉండగానే ఓ ప్రమాదానికి గురవుతాడు. ఆ తర్వాత క్యాన్సర్ అనే విషయమూ తెలుస్తుంది. తన స్నేహితుడి కోసం ఆ గ్యాంగ్ ఏం చేసింది? జీవితాల్లో ఎలా స్థిరపడ్డారు? నచ్చిన అమ్మాయిల మనసుల్ని ఎలా గెలుచుకొన్నారు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
నలుగురు చిన్ననాటి స్నేహితుల చుట్టూ సాగే కథే ఈ చిత్రం. జీవితంలో నచ్చిన పని చేస్తూ, స్నేహితులు కుటుంబంతో కలిసి ఆడుతూ పాడుతూ బతకాలని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. సినిమాలో మాత్రం ఇంత కథ కూడా ఉండదు. నవతరం ఆలోచనలకి, అలవాట్లకి అద్దం పట్టే సన్నివేశాల్ని తీర్చిదిద్ది… వాటిలో మంచి వినోదం, భావోద్వేగాల్ని పండించే ప్రయత్నం చేశారు. దాంతో ఓ మంచి కాలక్షేపంలా మారిపోయింది సినిమా. తొలి సగభాగం కథంతా కూడా స్నేహితులు కలిసి చేసే అల్లరి పనులు, వాళ్ల ప్రేమ, రొమాన్స్‌తోనే సాగుతుంది. కానీ ఆ సన్నివేశాల్నే నాణ్యతతో తీర్చిదిద్దాడు దర్శకుడు. యువతరాన్ని ఆకట్టుకునేలా రొమాంటిక్ సన్నివేశాల్ని, ఆహ్లాదంగా తీర్చిదిద్దాడు. విరామానికి ముందే ఓ చిన్న కాన్ఫ్లిక్ట్. అప్పట్నుంచైనా కథ ఉంటుందేమో అనుకొంటారంతా. కానీ కథగా కాకుండా ఓ జ్ఞాపకాల్లాగా సన్నివేశాలు సాగిపోతుంటాయి. ఒక పక్క బీర్ తయారు చేసి అమ్మాలని ప్రయత్నించడం… మరోపక్క చావు బతుకుల్లో ఉన్న స్నేహితుడిని గట్టెక్కించాలనే తపన… వీటి మధ్యలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలతో అక్కడక్కడ మంచి భావోద్వేగాలు పండాయి. ఫ్రస్ట్రేటెడ్ ఐటీ ఉద్యోగి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాక కథలో మరింత జోష్ వస్తుంది. అతని సహకారంతో నలుగురు స్నేహితులు తాము అనుకొన్నది చేయడంతో కథ సుఖాంతమవుతుంది. ద్వంద్వార్థాలతో కూడిన సంభాషణలు, పెద్దలకి మాత్రమే అనిపించే సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. కానీ దర్శకుడు యూత్నే టార్గెట్ చేసి తీసిన సినిమా కావడంతో, వాళ్లకి నచ్చితే చాలన్నట్టుగా తన పని తాను చేసుకుపోయినట్టు అనిపిస్తుంది.
నటీనటులు… సాంకేతికత
నటులంతా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిజ జీవితాల్నే కళ్లకుకట్టారేమో అన్నంతగా దర్శకుడు వాళ్లని పాత్రల్లో లీనం చేశారు. ఇందులో వినోదం పండటానికి ప్రధాన కారణం కూడా అదే. తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్‌లు నలుగురూ కూడా మంచి టైమింగ్‌ని కనబరచడం సినిమాకి కలిసొచ్చే విషయం. కథానాయికలు కూడా అందంగా కనిపించారు. రాహుల్ రామకృష్ణ సినిమాకి హుషారు తీసుకొచ్చాడు. రాజ్ బొల్లం అనే పాత్రలో ఆయన పండించిన నవ్వులు చాలా బాగా పండాయి. సాంకేతికంగా సినిమా బాగుంది. రాజ్ తోట కెమెరా, రథన్ సంగీతం ఆకట్టుకుంటాయి. శ్రీహర్ష కొనుగంటి క్లాస్‌గా సినిమాని తీర్చిదిద్దాడు. కథలో బలం లేకపోయినా, కథనం పరంగా, రచన పరంగా ఆయన పనితనం మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయిలోనే ఉన్నాయి.
తీర్పు
యువతరాన్ని టార్గెట్ చేసుకొని చేసిన ఈ సినిమా వాళ్లని మెప్పిస్తుంది. ద్వితీయార్థం అక్కడక్కడా సాగదీతలా… లాజిక్ మిస్ అయినట్టుగా సాగినప్పటికీ వినోదం మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది.
ఫినిషింగ్ టచ్ : కుర్రాళ్ళ కోసం
తెలుగు360 రేటింగ్ 2.75/5