ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ సీటుపై కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కన్నేశాయి. పట్టువిడవకుండా అదే సీటును కోరుకుంటున్నాయి. కూటమిలో కుంపటికైనా సిద్ధమే కానీ ఆసీటును వదులుకునేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా లేవు. పొత్తుల్లో భాగంగా హుస్నాబాద్ సీటును తమకు కేటాయించాలని సీపీఐ మొదటి నుంచి కోరుతుంది. కేవలం మూడు స్థానాలే కేటాయిస్తామని వస్తున్న లీకులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ సంగతి తేల్చకుండానే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై అసహనంతో ఉన్నారు. మహాకూటమిలో కాంగ్రెస్ వైఖరిపై ఆయన ఏకంగా మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశారు.
హుస్నాబాద్ సీటుపై అమీతుమీ తేల్చుకునేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఆదివారం సమావేశం కాబోతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అత్యవసర సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. కూటమిలో ఇంత రచ్చకు కారణమైన హుస్నాబాద్ నియోజవర్గంపై రెండు పార్టీలు కన్నేయడానికి కారణం ఈసారి అక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తాడనే నమ్మతమేయ సీపీఐ ఈసీటును కోరేందుకు ప్రధాన కారణం అక్కడ ఆ పార్టీకి కొంత క్యాడర్ ఉంది. ఈ నియోజకవర్గంలో ఎక్కువసార్లు గెలుపొందింది కూడా సీపీఐనే. ఆరుసార్లు సీపీఐ అభ్యర్థులు గెలిచారు. అలాగే మూడు సార్లు కాంగ్రెస్, ఒక్కసారి కాంగ్రెస్ ఐ కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో పొత్తు కారణంగా.. ఈ స్థానాన్ని సీపీఐ వదులుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి కి అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి ఇక్కడి నుంచి తమకు అవకాశం కల్పించాలని సీపీఐ పట్టుబడుతోంది.
హుస్నాబాద్ సీటుపై సీపీఐ సీరియస్ గా ఉంది. దానితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆదివారం జరిగే సమావేశంలో తాడో పేడో నిర్ణయిం తీసుకోవాలనుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పట్టు విడుపులు ప్రదర్శిస్తుందా..? లేక సీపీఐ ఉంటే ఉంది.. లేకపోతే పోయిందని అనుకుంటుందా..? వేచి చూడాల్సిందే..!