తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి. సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలనే లేఖను… ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఇవ్వడంతో… ఒక్కసారిగా రాజకీయం మారిపోయింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. టీఆర్ఎస్ఎల్పీలో… సీఎల్పీ విలీన ప్రక్రియ ముందుకురావడానికి అనివార్య పరిస్థితుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డినే కారణం అయ్యారు. ఆయన ఎంపీగా విజయం సాధించడంతో… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దాంతో.. విలీనం కోసం టీఆర్ఎస్ ఎదురు చూస్తున్న సంఖ్య ఆటోమేటిక్‌గా వచ్చి చేరింది. అయితే.. ఇప్పుడు.. టీఆర్ఎస్… విధానం తప్పని నిరూపించే.. అవకాశం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి దక్కబోతోంది. అదే హుజూర్ నగర్ ఉపఎన్నిక.
సీఎల్పీ విలీనంపై హుజూర్ నగర్ ప్రజలు తీర్పు చెబుతారా..?
సాధారణంగా.. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా.. అవి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో…హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రజాభిప్రాయం అన్నట్లుగా మారడం ఖాయమని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నేతలకు…ఇప్పుడు సీఎల్పీ విలీనం అప్రజాస్వామికం అని ప్రజల్లోకి వెళ్లేందుకు దొరికిన గొప్ప అవకాశం హుజూర్ నగర్ ఉపఎన్నిక. అందుకే… అప్రజాస్వామికంగా..రాజ్యాంగ విరుద్ధంగా… సీఎల్పీని ..టీఆర్ఎస్లో కలుపుకున్నారని.. దీన్ని వ్యతిరేకించాలంటూ.. కాంగ్రెస్ హుజూర్నగర్ బరిలో నిలబడే అవకాశం ఉంది. దీన్నే ప్రచారాస్త్రం చేయడానికి… ఆ పార్టీ వ్యూహాకర్తలు ప్రయత్నిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే.. టీఆర్ఎస్ అంతే ఘాటుగా .. ధీటుగా కౌంటర్ ఇవ్వకుండా ఉండదు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని నిరూపించేందుకు.. హుజూర్ నగర్లో సర్వశక్తులు ఒడ్డేందుకు గులాబీ శ్రేణులు ప్రయత్నిస్తాయి. అందు కోసం.. ఇప్పటికే.. ఆ పార్టీకి ముఖ్య నేతలు .. హుజూర్ కేంద్రంగా…వ్యూహాల అమలు ప్రారంభించారు.
ఉత్తమ్‌కు విషమపరీక్షగా హుజూర్నగర్..!
పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నప్పటికీ.. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని మళ్లీ గెలిపించకపోతే.. హైకమాండ్ వద్ద పలుకుబడి కోల్పోవాల్సి వస్తుంది. గత నాలుగు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్,టీఆర్ఎస్,వైసీపీ,టీడీపీల మధ్య జరిగిన చతుర్ముఖ పోటీలో… ఓట్లు భారీగా చీలిపోవడంతో..టీఆర్ఎస్ అభ్యర్థిపై మంచి మెజార్టీతో విజయం సాధించారు. 2018లో వచ్చిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో… ఏడు వేల మెజార్టీ మాత్రమే సాధించారు. అక్కడ ఆయన తనకు 40వేల మెజార్టీ వస్తుందని ఆశించారు. చివరికి.. ఏడు వేలతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. అయితే.. పార్లమెంట్‌కు పోటీ చేసినప్పుడు మాత్రం.. ఆయన హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కన్నా.. పదమూడు వేల ఓట్లు అధికంగా తెచ్చుకున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో… ఉత్తమ్ ముఖాముఖి పోరు నడిచింది. ఉపఎన్నికల్లోనూ… దాదాపుగా అలాగే ఉండొచ్చు. టిక్కెట్ ఉత్తమ్ ఎవరికి చెబితే.. వారికి ఇస్తారు కాబట్టి… బాధ్యత అంతా ఆయనపైనే ఉంటుంది.
చాలెంజ్‌గా తీసుకోనున్న టీఆర్ఎస్..!
తెలంగాణ రాష్ట్ర సమితి… హుజూర్ నగర్ ఉపఎన్నికను చాలెంజ్ గా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. హూజూర్‌నగర్ లాంటి కంచుకోటను..గెలిస్తే..కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బకొట్టినట్లే. పైగా.. టీఆర్ఎస్ చేసిన రాజకీయానికి ప్రజల మద్దతు లభించినట్లుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గెలిస్తే…టీఆర్ఎస్ …తెలంగాణలో చేస్తున్న రాజకీయాన్ని ప్రజలు తిరస్కరించారని… చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అదే టీఆర్ఎస్ గెలిస్తే.. మాత్రం.. కాంగ్రెస్ పార్టీ కోలుకవడం చాలా కష్టమవుతుంది. టీఆర్ఎస్ఎల్పీలో.. సీఎల్పీ విలీనానికి ప్రజల మద్దతు లభించిందని.. టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో.. కంచుకోటను కూడా నిలబెట్టుకోలేకపోయారన్న చెడ్డపేరు కాంగ్రెస్ నేతలకు వస్తుంది. ఇప్పటికే అంతంతమాత్రం ధైర్యంతో ఉన్న క్యాడర్‌కు ఇది మరింత ఇబ్బందికరం.