టీఆర్ఎస్కు ఎలా సాధ్యమయింది..?
ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనే ప్రచారం..! మరో వైపు కాంగ్రెస్కు కంచుకోటలాంటి నియోజకవర్గం.. ! కాంగ్రెస్ నేతల్లో ఐక్యతారాగం..! కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి దూరం..! మద్దతు ప్రకటించిన సీపీఐ వెనక్కు పోయింది..! అయినా …హుజూర్ నగర్లో గులాబీ జెండా రెపరెపలాడింది. కారు స్పీడ్ దెబ్బకు… కాంగ్రెస్ కంచకోట బద్దలయింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇజ్జత్ పోయింది. ఇంతగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి … ఆ పార్టీ అనుసరించిన వ్యూహమే కారణం. గ్రామస్థాయి నుంచి ప్రణాళికాబద్దంగా క్యాడర్ ను పెంచుకున్న ఫలితం. ఉత్తమ్ ఎంపీగా గెలిచినప్పటి నుండి… నియోజకవర్గంలోనే ఉండి పని చేసుకుంటున్న అభ్యర్థి కష్టం.
ఓటర్లపై ఏ మాత్రం ప్రభావం చూపని ఆర్టీసీ సమ్మె..!
హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే ఆర్టీసీ సమ్మె తెరమీదకు వచ్చింది. ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ అత్యంత కఠిన వైఖరి అవలభించడం.. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసీఆర్ నియంతృత్వానికి ముకుతాడు వేయాలంటే.. హుజూర్ నగర్ లో ఓడించాలనే పిలుపుని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చాయి. ఇది టీఆర్ఎస్ కు మైనస్ గా మారుతుందనే అంచనాకు రాజకీయవర్గాలు వచ్చాయి. కానీ ఫలితాల్లో… అలాంటిదేమీ కనిపించలేదు. టీఆర్ఎస్ ప్రభంజనం మాత్రమే వీచింది.
ఈ సారి మైనస్ అయిన కాంగ్రెస్ నేత ఐక్యత..
కాంగ్రెస్ నేతల ఐక్యమత్యం కూడా.. కలసి రాలేదు. ఎప్పుడూ ఉప్పు – నిప్పులా ఉండే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలసిపని చేశారు. వీరికి జానారెడ్డి కూడా సహకారం అందించారు. కానీ రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి … ఎప్పుడూ రెండు అయ్యే అవకాశం లేదు. ఒక్కో సారి సున్నా అవుతుంది. ఆ విషయం ఇప్పుడు తేలిపోయింది. అందరూ కలిసినా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను తెచ్చుకోలేకపోయారు. ప్రతీ సారి వారి అనైక్యత మైనస్ అవుతుందేమో కానీ.. ఈ సారి ఐక్యత మైనస్ అయినట్లుగా కనిపిస్తోంది.
టీఆర్ఎస్ సర్కార్ పై వ్యతిరేకత అంతా ప్రచారమే..!
కొద్ది రోజులుగా… తెలంగాణ సర్కార్ పై వ్యతిరేకత పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా తెలంగాణ సర్కార్ ఇబ్బందుల్లో పడటం… సంక్షేమ పథకాలు కూడా.. పూర్తి స్థాయిలో అమలు కాకపోతూండం.. అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో…ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించారు. అయితే.. హుజూర్ నగర్లో వచ్చిన బంపర్ మెజార్టీ చూస్తే.. అదంతా… ప్రచారమేనని కొట్టి పారేయక తప్పదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ జోరు చూపించేందుకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది.