హుజూర్ నగర్ ఉప ఎన్నిక త్వరలో ఉన్న నేపథ్యంలో ఒక సర్వే చేయించామని చెబుతున్నారు మంత్రి కేటీఆర్. ఆ నియోజక వర్గంలో తెరాస ముందంజలో ఉందనీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గమే అయినా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండో స్థానంలో ఉందన్నారు. తాను ముఖ్యమంత్రి అవుతా అని అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ ప్రచారం చేసుకున్నారనీ, అది నమ్మిన ప్రజలు ఆయనకి ఓటేశారన్నారు. గత ఎన్నికల్లో అక్కడ ట్రక్కు గుర్తుతో ఒక అభ్యర్థి బరిలోకి దిగకుండా ఉంటే… తెరాస గెలిచేదన్నారు. మొట్ట మొదటిసారిగా హుజూర్ నగర్లో తెరాస గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నియోజక వర్గంలో భాజపా అనేది సీన్లోనే లేదన్నారు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస చేయబోతున్న ప్రచారం ఏంటో తెలుసా… ఉత్తమ్ భార్యని గెలిపిస్తే అది ఆ కుటుంబానికి జరిగే మేలనీ, తెరాస అభ్యర్థిని గెలిపిస్తే అది నియోజక వర్గ ప్రజలందరికీ జరిగే మేలు అవుతుందని చెప్పబోతున్నారు! సైదిరెడ్డి గతంలో ఓడిపోయారు కాబట్టి… ఇప్పుడు మరోసారి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి సానుభూతి కలిసి వస్తుందనేది కేటీఆర్ ధీమా. దీంతోపాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యాక్టర్, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రచారం బాగా పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఒక్కసారి ప్రచారానికి వచ్చారంటే మొత్తం సీన్ మారిపోతుందనీ, తెరాస గెలుపుపై మరింత స్పష్టత వచ్చేస్తుందని కేసీఆర్ విశ్వాసంగా చెబుతున్నారు.
వాస్తవానికి, ఈ ఉప ఎన్నికలో తెరాస గెలవకపోయినా పెద్దగా ఫకర్ పడదుగానీ… లోక్ సభ ఎన్నికల తరువాతి నుంచి తెరాస హవాకి బ్రేక్ పడుతోందనే విమర్శలు పెరిగాయి. కాంగ్రెస్, భాజపాలకు కొన్ని ఎంపీ సీట్లు వచ్చేసరికి… అది, కేసీఆర్ సర్కారు మీద ప్రజల్లో వ్యక్తమౌతున్న వ్యతిరేకత అనే విశ్లేషణలే వినిపించాయి. ఆ తరువాత జెడ్పీలు బాగానే దక్కించుకున్నా… ఇప్పుడు జరుగుతున్నది అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కాబట్టి, ఫోకస్ వేరేలా ఉంటుంది. ఇప్పుడీ ఎన్నికను కూడా కేసీఆర్ పాలన మీద రెఫరెండమ్ గానే కాంగ్రెస్ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఈ ఉప ఎన్నికల్లో తెరాస ఓడితే… లోక్ సభతోపాటు ఇదిగో ఈ ఉప ఎన్నికలో కూడా తెరాస మీద ప్రజల వ్యతిరేకత వ్యక్తమైందని ప్రతిపక్షాలు ప్రచారం విమర్శల దాడి పెంచుతాయి. కాంగ్రెస్ కి ఈ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఎంత ప్రతిష్ఠాత్మకమో… దీన్ని గెలుచుకోవడం తెరాసకు కూడా అదే అవసరం! ఇంకోటి… ఇక్కడ భాజపా ఉనికే లేదంటున్నట్టుగా సర్వేలో తేలిందని కేటీఆర్ లెక్కలు చెబుతున్నారు! కానీ, ఆ పార్టీ కూడా హుజూర్ నగర్లో తమ సత్తా చాటుకోవాలనే పట్టుదలతోనే ఉంది. గెలుపు ధీమా భాజపాకీ ఉండదుగానీ… తెరాసను ఓడించాలన్న బలమైన పట్టుదల ఉంటుంది. కాబట్టి, చివరి నిమిషంలో ఆ పార్టీ ఏ తరహా నిర్ణయాలకైనా సిద్ధమయ్యే పరిస్థితి రావొచ్చు!