హూజూర్ నగర్ ఉప ఎన్నిక గెలుపు క్రెడిట్ నాదందే నాదని.. ఇద్దరు టీఆర్ఎస్ ముఖ్యులు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ క్రెడిట్ గోల ఇద్దరి నేతల మద్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి చేరింది. హూజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ చివరకు అనుకున్నది సాధించింది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. బాస్ ఆదేశాలతో హూజూర్ నగర్లోనే మకాం వేసిన పల్లా….ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేస్తూ వ్యూహాలు అమలు చేశారు. అభ్యర్థి ప్రకటించిన నాటి నుంచి జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లాలోనే ఉండి స్థానిక క్యాడర్ ను అప్రమత్తం చేశారు. అభ్యర్థి గెలుపు కోసం మంత్రికూడా జోరుగానే ప్రచారం నిర్వహించారు.
హోరాహోరీగా సాగుతుందనుకున్న ఎన్నికల పోరులో విజయాన్ని ఏకపక్షం చేసేందుకు నేతలందరూ పట్టుదలగా పనిచేశారు. దీంతో టీఆర్ఎస్ సునాయాస విజయం సాధించింది. అంతా బాగానే ఉన్నా ఇప్పుడీ విజయానికి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డిదేనని ఆయన అనుచరులు చెప్పుకుంటుంటే. కానే కాదంటూ మా మంత్రి జగదీశ్ రెడ్డిదేనంటూ ఆయన అనుచర వర్గం ప్రచారం చేస్తోంది. ఈ కారణంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి .జగదీశ్ రెడ్డికి మధ్య చెడిందనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలో తమ నేత మంత్రిగా ఉన్నా పల్లాదే హవా నడుస్తోందని జగదీశ్ రెడ్డి వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
మూడు రోజుల కిందట.. యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్ లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్సీ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని మాత్రం ఆహ్వానించలేదు. చివరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఆహ్వానంపంపారు. తనను ఆహ్వానించక పోవడం వెనుక మంత్రి జగదీశ్ రెడ్డే కారణమనే భావనలో పల్లా ఉన్నారు. ఆయన జగదీష్ రెడ్డి తీరుపై.. హైకమాండ్ వద్ద మొరపెట్టుకున్నారు. పల్లా, జగదీష్ రెడ్డిల మధ్య.. ముందు ముదు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి టీఆర్ఎస్లో ఏర్పడింది.