తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమయింది. ఐదు రౌండ్లకే… పది వేల ఓట్ల వరకూ మెజార్టీ రావడంతో..ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేదు. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే.. ఆర్టీసీ సమ్మె ప్రారంభమయింది. సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరిపై.. విపక్ష పార్టీలన్నీ తీవ్రమైన విమర్శలు చేస్తున్నా.. సీపీఐ ముందుగా మద్దతు ప్రకటించి.. తర్వాత ఉపసంహరించుకున్నా… ఆ ప్రభావం టీఆర్ఎస్పై పెద్దగా కనిపించలేదు. ఇంత వరకూ టీఆర్ఎస్ హుజూర్ నగర్లో… గెలవలేదు. మొదటి సారి.. విజయం సాధించబోతోంది. అదీ కూడా తిరుగులేని మెజార్టీ కనిపించబోతోంది.
సాధారణంగా ఉపఎన్నికల్లో అధికార పార్టీకే మొగ్గు కనిపిస్తూ ఉంటుంది. ఆ ట్రెండ్ హుజూర్ నగర్లో కనిపిస్తోంది. అయితే… హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటకావడం.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గం.. పెద్ద ఎత్తున అనుచరణ గడం ఉండటం… స్వయంగా తన భార్య పద్మావతినే అభ్యర్థిగా బరిలోకి నిలపడంతో… కాంగ్రెస్కు కాస్త ఆశలు చిగురించాయి. అయితే.. అధికార పార్టీ బలం ముందు… నిలబడటం సాధ్యం కాదని తేలిపోయింది. నిజానికి ఓటింగ్ సరళిలోనే… హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పుకున్నారు. ఇప్పుడు కౌంటింగ్లో అదే నిజమని తేలుతోంది.
హుజూర్ నగర్ ఫలితంతో… టీఆర్ఎస్లో మరింత జోష్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందని.. వస్తున్న ప్రచారానికి దీంతో.. చెక్ పడినట్లు అవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ సమ్మెపై మరింత కఠినంగా వ్యవహరిస్తారని.. కార్మికులు దిగిరాక తప్పదన్న అంచనాలు టీఆర్ఎస్లో ఏర్పడ్డాయి.