హుజూరాబాద్ ఉపఎన్నికను భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో సరితూగేలా అంగ , అర్థ బలాలను మోహరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికార పార్టీ అయితే.. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ. కేంద్ర ఎన్నికల సంఘం.. ఉపఎన్నికను నిర్వహిస్తుంది. దీంతో అధికార పార్టీ అడ్వాంటేజ్ బీజేపీకే దక్కే చాన్సులున్నాయి. అయితే.. స్థానిక యంత్రాంగం మాత్రం స్థానిక ప్రభుత్వానికే అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీని వల్ల ఎలక్షనీరింగ్ టీఆర్ఎస్కు అనుకూలంగా మారుతుంది. ఎక్కడ ఎన్నిక జరిగినా.. డబ్బులకు లోటు లేకుండా .. ఎన్నికలు నిర్వహించుకోగల స్థాయి టీఆర్ఎస్కు ఉంది.
ఇప్పుడు బీజేపీ కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో ఉంది. అందుకే.. హుజూరాబాద్ ఉపఎన్నికకు బీజేపీ ఇంచార్జీగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని నియమించారు. సహ ఇంచార్జ్‌లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యండల లక్ష్మీనారాయణలను నియమించారు. ప్రధానమంత్రి మోదీ దగ్గర కూడా మంచి పేరు ఉన్న జితేందర్ రెడ్డి.. ఎన్నికల ఖర్చులకు నిధులు సర్దడంలో ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ హైకమాండ్‌కు కీలకమైన నేతగా ఉండేవారు. ఇప్పుడు.. బీజేపీలో ఆ రోల్ పోషించే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణలో బీజేపీ రేసులో ఉందని నిరూపించాలంటే.. హుజూరాబాద్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితి. అందుకే టీఆర్ఎస్తో పోటీగా డబ్బులు ఖర్చుపెట్టడంలో బీజేపీ వెనుకాడదని చెప్పడానికే ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డిని నియమించినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ సైలెంట్‌గా హుజూరాబాద్‌లో ప్రచారం ప్రారంభించేసింది. బీజేపీ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్కు అభ్యర్థి లేరు.. వార్ వన్ సైడేనని నమ్మకంతో … బరిలోకి దిగుతున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌లో నోట్ల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.