హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారని బహిరంగసభ కోసం స్థలాలను హరీష్ రావు వెదుకుతున్నారు కానీ … టీఆర్ఎస్ అధినేత మాత్రం ఈ విషయంలో అంత ఆసక్తిగా లేరు. కేటీఆర్ తాను ప్రచారానికి వెళ్లబోవడం లేదని ప్రకటించారు. కేసీఆర్ పర్యటన కూడా ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ప్రచారానికి గట్టిగా వారం రోజులు కూడా లేని సందర్భంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటే.. కేసీఆర్ కూడా ప్రచారానికి వెళ్లబోరని టీఆర్ఎస్ వర్గాలు అంచనాకు వచ్చేశాయి. ఇప్పటికే రెండు, మూడు నెలలుగా హరీష్ రావు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.
తన రాజకీయ టాలెంట్‌ను అంతా ప్రదర్శించి టీఆర్ఎస్ను గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆయితే ఆయనకు అగ్రనాయకత్వం నుంచి అందుతున్న సహకారం అంతంతమాత్రంగానే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కూడా హరీష్ నేతృత్వంలో పని చేస్తున్నారు కానీ.. అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కేటీఆర్ మాత్రం కనీసం ప్రచారానికి కూడా వెళ్లబోనని చెబుతున్నారు. దీంతో అక్కడ ఫ లితం తారుమారైతే మొత్తం హరీష్ రావు మెడకు చుట్టేస్తారని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.
దానికి తగ్గట్లుగానే కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఒక వేళ గెలిస్తే ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నట్లుగా అది చాలా చిన్న ఎన్నిక అని క్రెడిట్ తక్కువలో తక్కువగా హరీష్ కు ఇచ్చి మిగతా అంతా కేసీఆర్ పాలనకు కట్టబెట్టేస్తారని అంటున్నారు. మొత్తానికి హుజురాబాద్ రాజకీయం నేరుగా ఈటలపైనే కాకుండా సొంత పార్టీ నేతలపైనా టీఆర్ఎస్ హైకమాండ్ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.