కాంగ్రెస్‌లో ఉదయం ఓ ఫోన్ రికార్డింగ్ కారణంగా ప్రారంభమైన తుపాన్ సాయంత్రానికి తీరం చేరింది. హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి పాడి కౌశిక్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసేశారు. తనపై ఏ క్షణమైనా వేటు వేస్తారన్న ఉద్దేశంతో ఆయన ముందుగానే గౌరవంగా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ కాంగ్రెస్ కార్యకర్తతో హుజూరాబాద్ టీఆర్ఎస్ టిక్కెట్ తనకేనని చెప్పుకుంటున్న ఆడియో బయటకు రావడంతో ఉదయం నుంచి గగ్గోలు రేగింది. గతంలోలా కాకుండా ఈ సారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం చురుగ్గా స్పందించింది. అప్పటికప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చింది. మరో వైపు రేవంత్ రెడ్డి.. పార్టీలోని ఇంటిదొంగల్ని వదిలేది లేదని నేరుగా ప్రకటించారు. ఈ పరిణామాలతో కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. ఈటలకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఈటలకు టీఆర్ఎస్ హైకమాండ్‌తో చెడిన తర్వాత ఆయనను కార్నర్ చేశారు. అనేక ఆరోపణలు చేశారు. ఇదంతా టీఆర్ఎస్ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందన్న ప్రచారం కూడా ఉంది. టీఆర్ఎస్ తరపున టిక్కెట్ ఆశిస్తున్న వారిలో… ఆయన పేరు కూడా ఉంది. దీంతో రేవంత్ రెడ్డి.. హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై డైలమాలో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ను అక్కడ నిలబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ క్రమంలో.. కౌశిక్ రెడ్డి పార్టీలోనే ఉండి ఉంటే.. రేవంత్‌కు చికాకులు ఎదురయ్యేవి . ఇప్పుడు తాను అనుకున్నట్లుగా అభ్యర్థిని నిర్ణయించగలుగుతారు. మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆడియోలు కాదు.. అంతకు మించిన క్రమశిక్షణా చర్యలు ఉల్లంఘించినా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు రేవంత్ ఉన్నాడు కాబట్టి పరిస్థితి మారిపోయింది. ఒక్క రోజులోనే… బహిష్కరణ వేటు వేయడం కాకుండా.. ఆ వివాదాస్పద నేతే బయటకు వెళ్లిపోయేలా చేశారు. ఇది రేవంత్ రెడ్డి జమానాలో పీసీసీలో వచ్చిన మార్పని చెప్పుకోవచ్చు.