హూజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రెండు రోజుల్లో రాబోతోందని తెలంగాణ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ మేరకు సంకేతాలు వచ్చాయని లీడర్లు హడావుడి ప్రారంభించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనూహ్యంగా .. వాసాలమర్రి నుంచే దళిత బంధు పథకాన్ని ప్రారంభించడం… ఈ రోజే లబ్దిదారుల ఖాతాల్లో వేయడం వెనుక … ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చినా ఆ పథకం పాతదేనని చెప్పి.. అమలుకు ఇబ్బంది లేకుండా చేయడమేననని అంటున్నారు. పదహారో తేదీన ఆయన రైతు బంధును ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఈ లోపే నోటిఫికేషన్ వస్తుందని గట్టిగా నమ్మడంతోనే వాసాలమర్రి టూర్ పెట్టుకున్నారని అంటున్నారు.
ఈ విషయంలో భారతీయ జతా పార్టీ నేతలు చురుకుగా ఉన్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తూ గాయపడటంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు డిశ్చార్జై వెంటనే హుజూరాబాద్ వెళ్లనున్నారు. మోకాలికి శస్త్రచికిత్స జరిగినందున.. ఆయన ఇక పాదయాత్ర చేయరు కానీ పార్టీ వ్యవహారాలను మాత్రం దగ్గరుండి చూసుకుంటారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడకుండానే నియోజకవర్గానికి వెళ్లడానికి కారణం ఉపఎన్నిక షెడ్యూల్ వస్తుందన్న సమాచారమేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అంతర్గంగా ఇప్పటికే హుజూరాబాద్ ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
నిజానికి దేశంలో ఇతర చోట్ల జరగాల్సిన ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని… ఈసీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడల్లా విడుదల చేయదని అనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం.. ఖచ్చితంగా ఉపఎన్నిక వెంటనే వస్తుందని నమ్ముతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీకి లేఖ రాసి.. ఇప్పుడల్లా ఎన్నికలు వద్దన్న సందేశాన్ని ఈసీకి పంపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. పైగా అత్యంత సున్నితమైన కరోనాను ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఈ క్రమంలో ఈసీ ఎన్నికలకు వెళ్తుందా.. నోటిఫికేషన్ ఇస్తుందా అన్నది రెండు రోజుల్లో తేలిపోనుంది.