తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చాలా విషయాల్లో తమ రాష్ట్రాన్ని అద్వితీయంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. దేశమంతా తెలంగాణ గురించి మాట్లాడుకునే అంశాలు ఉండాలని, దేశమంతా తెలంగాణ వైపు చూడాలని.. కొత్తగా సాధించుకున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కలగనడంలో తప్పేమీలేదు. అందుకు ఆచరణలో ఆయన రకరకాల పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా దేశంలో అత్యంత ఎత్తయిన, అతి పెద్ద జాతీయ పతాకాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నిర్ణయించడం ఇలాంటి నిర్ణయాల కోవలోకే వస్తుంది.
హైదరాబాదు నగరంలో దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకం ఏర్పాటు కాబోతున్నది. 301 అడుగుల ఎత్తులో పతాకాన్ని సగర్వంగా సగం నగరానికి కనిపించేలా జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. నగరం నడిబొడ్డున ఉండే ట్యాంక్ బండ్ మీద.. బతుకమ్మలు ఆడే పాయింట్లోనే ఈ త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా మన దేశంలో జార్ఖండ్ రాజధాని రాంచిలో 230 అడుగుల ఎత్తులో ఉన్న జాతీయ పతాకమే అతిపెద్దదిగా ఉంది. దానిని మించిపోయేలా హైదరాబాదులో అతిపెద్ద పతాకాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేయడానికి ఇలాంటి జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయడం ఉపయోగపడుతుందని కేసీఆర్ అనడం విశేషం. ఈ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీన కేసీఆర్ ఆవిష్కరించబోతున్నారు.
కేసీఆర్ తమ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నభూతో అనిపించే విధంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యల్లోనే ఇలాంటివన్నీ జరుగుతుండడం విశేషం. తెలంగాణ అమరవీరులకోసం అతిపెద్ద స్తూపం కూడా ఏర్పాటు కాబోతున్నది. అతిపెద్ద జాతీయపతాకం అనేది ట్యాంక్‌బండ్ మీద బతుకమ్మ ఘాట్ మీదనే ఏర్పాటుచేయబోతున్నారు. తన రాష్ట్రం ‘నెంబర్‌వన్’గా ఉండాలనుకునే కేసీఆర్ తపనకు ఇది నిదర్శనం కావొచ్చు. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రాండ్ హైదరాబాద్‌ను సృష్టించడంలో తనదైన ముద్ర కోసం కేసీఆర్ తహతహ లాడుతున్నారని అర్థమవుతోంది.