ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి అలజడికి కారణం అవుతున్న కత్తి మహేష్‌ను ఈ కారణంగానే… హైదరాబాద్ నుంచి బహిష్కరించామని తెలిపారు. ఆరు నెలల పాటు బహిష్కరణ అమలులో ఉంటుందన్నారు. కత్తి మహేష్‌ను చిత్తూరులో విడిచిపెట్టామని.. పోలీసుల అనుమతి లేకుండా.. హైదరాబాద్‌లోకి అడుగు పెట్టకుండా..అన్ని జిల్లా ఎస్పీలనూ అప్రమత్తం చేశామన్నారు. భావప్రకటనా స్వేచ్చ పేరుతో ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఒక్క చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదని గుర్తు చేశారు.
కత్తి మహేష్ రాముడిపై చేసిన వ్యాఖ్యలపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల కిందట.. ఆయనను.. బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని … అరెస్ట్ నోటీసులు ఇచ్చి విడిచి పెట్టారు. అయినా కత్తి మహేష్ రాముడిపై తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ లోపు కొన్ని హిందూ సంస్థలు.. కత్తి మహేష్‌పై … చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన ప్రారంభించారు. పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్ నుంచి యాదాద్రి పాదయాత్ర కూడా చేయాలని తలపెట్టారు. ఉదయం పెద్ద సంఖ్యలో ఆయన పాదయాత్రకు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అనుమతి లేదని ఆయనను పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పరిపూర్ణానందకు మద్దతుగా బ్రాహ్మణ సంఘాల పేరుతో కొంత మంది ఆందోళనకు దిగారు. వారందరికీ పోలీసులు సర్దిచెప్పారు.
సున్నితమైన, మతపరమైన భావోద్వేగ అంశం కావడంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక రాజకీయాలు ఉంటే పరిస్థితి మరింత అదుపు తప్పుతుందనే ఉద్దేశంతో.. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కత్తి మహేష్‌లా ఎవరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా… ఊరుకోబోమని పోలీసులు చెబుతున్నారు. కత్తి మహేష్ వ్యవహారం ప్రస్తుతం ఏపీకి చేరింది. ఏపీ నుంచి కూడా కత్తి మహేష్‌ను బహిష్కరించాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి.