ఓ పోలీస్ స్టేషన్ లో సీఐనో..ఎస్ఐనో బదిలీ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో పని చేసే ప్రతీ ఉద్యోగిని బదిలీ చేయడం ఉండదు. కానీ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బంది మొత్తాన్ని ఒకే రోజు ట్రాన్స్ ఫర్ చేసేశారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. వారు వెంటనే బాధ్యతలు తీసుకున్నారు. ఈ బదిలీలు సంచలనంగా మారాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోం గార్డులు.. మొత్తం 85 మంది సిబ్బందిని బదిలీ చేసి ఆర్మ్డ్ రిజర్వ్‌కు అటాచ్ చేశారు.
2018లో దేశంలోనే బెస్ట్ పోలీస్ స్టేషన్ గా పేరు తెచ్చుకున్న పంజాగుట్ట పీఎస్ లో కీలకమైన సమాచారాలు లీక్ అవుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ ప్రకటించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో పాటు.. పలు కీలకమైన విషయాలు బయటకు పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ప్రజాభవన్ ఉంది. ప్రభత్వానికి చెందిన అత్యంత కీలక సమాచారాన్ని మాజీ ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా ఒకే సారి సిబ్బంది మొత్తంపై బదిలీ వేటు పడింది. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది 82 మందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులకు నియమించారు.
సీపీ శ్రీనివాసరెడ్డి చాలా కాలం లూప్ లైన్ పోస్టుల్లో ఉన్నారు. నిజాయితీ గల అధికారిగా.. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గని నేతగా పేరుంది. ఆయన వచ్చిన తర్వాత తప్పుడు పనులు చేసే పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.