ఒకరి పై ఒకరు తుపాకీ గురి పెట్టుకుని అందరూ ఒకరినొకరు కాల్చుకుని చంపే సీన్లు.. క్రైమ్ ధ్రిల్లర్ సినిమాల్లో కామన్. అత్యాశకు పోవడమే దీనికి కారణం. ఇప్పుడు అజహరుద్దీన్ ప్రెసిడెంట్‌గా ఉన్న.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఇప్పుడు అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఒకరిని ఒకరు తొలగించుకుంటూ.. రాజకీయం చేసుకుంటున్నారు. దీంతో.. క్రికెట్‌పైనా.. క్రికెట్ రాజకీయాలపైనా ఆసక్తి ఉన్న వారంతా.. వీళ్లేంటి..?అని నోరు వెళ్ల బెట్టాల్సి వస్తోంది. కేటీఆర్ మద్దతిచ్చారో.. లేపోతే.. మరో విధంగా నరుక్కొచ్చారో కానీ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడవ్వాలన్న కోరికను.. అజహరుద్దీన్ గతంలో తీర్చుకున్నారు. ఇప్పటికీ ఆయన అధ్యక్షుడిగానే ఉన్నారు.
అయితే.. ఇటీవల ఆయనను తొలగిస్తూ.. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అజహర్‌పై గతంలో కేసులున్నాయని అపెక్స్ కౌన్సిల్ చెప్పింది. కేసులున్నా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనే లాజిక్ మిస్సయింది. అయితే.. అజహరుద్దీన్ మరీ అంత అమాయకంగా ఏమీ లేరు. అంతకు ముందే ఆయన అంబుడ్స్‌మన్‌గా దీపక్ వర్మ అనే సన్నిహితుడ్ని నియమించారు. కౌన్సిల్ నిర్ణయాన్ని అంబుడ్స్‌మన్ ముందు అజరుద్దీన్ సవాల్ చేశారు. వెంటనే.. అంబుడ్స్‌మన్.. అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిచారు. పాలనా వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా అజహరుద్దీనే మొత్తం చూసుకుంటారని ప్రకటించారు. అంబుడ్స్ మన్ చర్యలతో అపెక్స్ కౌన్సిల్ షాకయింది. ఇప్పుడు అసలు అంబుడ్స్‌మన్ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది.
అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం జస్టిస్ దీపక్ వర్మకు లేదని వాదిస్తున్నారు. వీరి వాదనల సంగతేమో కానీ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అందరూ ఆలౌట్ అయిపోయారు. అజహరుద్దీన్‌ను అపెక్స్ కౌన్సిల్ తీసేసింది. అపెక్స్ కౌన్సిల్‌ను అంబుడ్స్ మన్ రద్దు చేశారు. అంబుడన్స్ మన్ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. మొత్తంగా తనకు వ్యతిరేకంగా కూటమి కట్టాలనుకున్న వారికి అజహర్ తనదైన బ్యాటింగ్‌తో… రివర్స్ ఎటాక్ చేస్తున్నారని అంటున్నారు. అయితే.. ఎలా చూసినా హైదరాబాద్ క్రికెట్ మాత్రం… ఎవరికీ ఉపయోగపడకుండా పోయింది. చివరికి హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బౌలర్ సిరాజుద్దీన్ గురించి పట్టించుకునే తీరిక కూడా వారికి లేదు.