తెలంగాణలో మరుగున పడిపోయిన డ్రగ్స్ కేసు మరో సారి తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు.. ఆ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల వద్దకు చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ కేసు ఎటూ తేలడం లేదని.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అది ఇప్పుడు వేసింది కాదు… 2017లోనే ..డ్రగ్స్ కేసులో ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడే వేశారు. ఈ పిటిషన్పై తాజా విచారణలో హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని… తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
2017లో రేవంత్ పిటిషన్ వేసినప్పుడు కేసులో అంతర్జాతీయ ముఠాల ప్రమేయముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఈ కేసు విచారణకు వేసిన ఎక్సైజ్ సిట్ పరిధి సరిపోదని సీబీఐ, ఈడీ, ఎన్సీబీ సంస్థలకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దర్యాప్తుకు ఈడీ, ఎన్సీబీ సిద్ధంగా ఉన్నాయని.. రేవంత్ తరపు న్యాయవాది తాజాగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ తాజా పరిస్థితి, దర్యాప్తు నివేదికపై డిసెంబర్ 10లోపు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత కేసు విషయంపై హైకోర్టు ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇప్పటికే ముంబైలో డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ చేస్తోంది. కర్ణాటకలోనూ సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న భారీ రాకెట్పైనా విచారణ జరుగుతోంది. ఈ సమయంలో హైదరాబాద్ డ్రగ్స్ కేసు కూడా.. ఎన్సీబీ చేతికి వెళ్తే.. ముంబై, బెంగళూరు తరహాలో ఇక్కడా మీడియా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.