చంద్రబాబుకి ఇక్కడ ఏం పని? అని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించడం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేస్తున్న టిఆర్ఎస్ కార్యకర్తల్లో అభిమానుల్లో ఒక హుషారుని సృష్టిస్తుంది. అదేసమయంలో టిఆర్ఎస్ బలహీనతను కూడా ఈ ప్రశ్న చెప్పకనే చెబుతోంది!
నిజమే! హైదరాబాద్ లో టిఆర్ఎస్ ఇప్పుడు కూడా బలంగా లేదు. మొత్తం 150 డివిజన్లు వున్న హైదరాబాద్ లో తెలంగాణా సాధనకోసం సాగిన ఉద్యమాల్లో పాల్గొన్నవారిలో కేవలం 14 మందికే టిఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. మిగిలిన వారందరూ కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి పార్టీల నుంచి ఫిరాయించిన వారే. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా రాజధానిలో పార్టీని నిర్మించుకోలేకపోవడం సంస్ధాగతంగా పెద్దవైఫల్యం.
కేవలం అధికారం తప్ప హైదరాబాద్ లోని సగటు పౌరుల్లో టిఆర్ఎస్ కు బలం లేదు. ప్రజల్లోబలానికీ అధికారంలోకి రావడానికీ సంబంధంలేదు. కార్పొరేషన్లో ఎక్స్ అఫీషియో సభ్యుల నియామకంద్వారా మేయర్ పదవిని టిఆర్ఎస్ సాధించుకోబోతోంది. ఈ దుర్నీతి కాంగ్రెస్ తో మొదలై, తెలుగుదేశంతో కొనసాగి, టిఆర్ఎస్ తో కొత్తపుంతలు తొక్కబోతోంది…అంతే!
2002 సంవత్సరంలో కార్పొరేషన్ మేయర్‌కు 5వసారి జరిగిన ఎన్నికల్లో 57మంది పోటీ చేశారు. తెలుగు దేశం పార్టీ విజయం సాధించి మేయర్‌గా తీగల కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థి సుభాష్ చందర్జీ డిప్యూటీ మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోనే అత్యంత ఎక్కువమంది 26.43 లక్షల మంది పాల్గొన్న ప్రత్యక్ష పద్ధతి ఎన్నికల్లో 3,62,119 ఓట్లు సాధించి తీగల కృష్ణారెడ్డి మేయర్‌గా ఎన్నిక య్యారు. ఎంఐఎం రెండవస్థానం, కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మూడవ స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని నరసింహారెడ్డి 69,000 ఓట్లతో 4వ స్థానంలో నిలిచారు. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడి 2009లో జరిగిన ఎన్నికల్లో (బహుశ ఓటమి భయంతో) టీఆర్ఎస్ పోటీచేయలేదు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 52, తెలుగు దేశం 45, ఎంఐఎం 43, బీజేపీ 5 స్థానాల్లో గెలుపొందాయి. అప్పుడు ఎం ఐఎం, కాంగ్రెస్ పొత్తుతో రొటేషన్ పద్ధతిలో మేయర్ పీఠాన్ని దక్కించు కున్నాయి.
గత జనరల్ ఎన్నికల్లో జీహెచ్ యంసీ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ 3 స్థానాల్లో గెలుపొందింది. అదే బీజేపీ, టీడీపీ కూటమి 14స్థానాల్లో, ఎంఐఎం 7 విజయం సాధించారు. 3 ఎంపీ స్థానాలకుగాను టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఒక్కో సీటును గెలుచు కున్నాయి. కనుకనే టీఆర్ఎస్ ఈ ఎన్నికల కోసం శతవిధాల ప్రయత్నిస్తూ పోరాటం సాగిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ-బీజేపీ, టీఆర్ఎస్- ఎంఐఎం మధ్యే గట్టి పోటీ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగానే బరిలో నిలుస్తున్నదే తప్ప గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నది. ఎం ఐ ఎంతో కలిసి మేయర్ పీఠం దక్కించుకో వాలని టీ ఆర్ ఎస్ తహతహలాడుతుండగా, బీజేపీతో కలిసి పీఠం దక్కిం చుకోవడానికి టీడీపీ తీవ్రంగా కృషి చేస్తున్నది. టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, కవిత ; బీజేపీ నుంచి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి; టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డి, మజ్లీస్ నుంచి అక్బర్, అసదుద్దీన్లు; కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, భట్టి వ్రికమార్కలు ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుకోసం వరాల వర్షం కురిపిస్తోంది. అబద్దాలు చెబుతోంది.హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలను తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చాయి. కృష్ణా మొదటిదశ 2003 సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రప్పించింది. గోదావరి జలాలను 2008 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రప్పించడానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది. కానీ ఈ జలాలను రప్పించిన ఘనత తమదేనంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ హోర్డింగులలో చాటుకుంటోంది.
వందలోపు వున్న కరెంటు బిల్లును, 623 కోట్ల రూపాయల మేర నల్లా బిల్లు, ఇంటి పన్ను బకాయిలను రద్దు చేసింది. రూ.1200లు ఆస్తి పన్ను చెల్లించేవారు. రూ.101లు చెల్లిస్తే సరిపోతుందని, దీని ద్వారా 3.12 లక్షల మందికి ప్రయో జనం కలుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. 15 ఏళ్ల నుంచి బకాయిలు ఉన్న 455 కోట్ల నీటి బకాయిలను ప్రభుత్వం రద్దు చేసింది. గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పథక వ్యయాన్ని 5.3 లక్షల నుంచి 7 లక్షల వరకు పెంచారు.
ఎన్ని చేస్తున్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా సర్వీసు రంగాలను ఉద్దీపింపజేసి జంటనగరాల ఎకానమీలో కి ఆదాయాలను సంపదలను పంప్ చేసిన చంద్రబాబు ప్రభావం విద్యావంతుల్లో గట్టిగా వుంది…అయితే రాష్ట్రవిభజనానంతర పరిణామాలు, ఓటునోటు కేసు పర్యావసానాలు తెలుగుదేశాన్ని కూడా బలహీనపరచాయి. 83 మందిని తెలుగుదేశం, 67 మందిని బిజెపి నిలబెట్టాయి. డివిజన్ కు సగటున 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగల పరిస్ధితి ఈ కూటమిలో పోటీదారులు అందరికీ లేదు. అయినా కూడా ప్రజల్లో సానుభూతి, కార్యకర్తల బలమే తెలుగుదేశం బిజెపి పార్టీల కూటమికి పెద్దశక్తి. టిఆర్ఎస్ మాటలకు గాయపడి వున్న సీమాంధ్రులు లేదా సెటిలర్లు ఒక విధమైన కసితో హైదరాబాద్ లో కెసిఆర్ కు ఓటమి చూడాలనుకుంటున్నారు.
తెలుగుదేశం అనుకూల శక్తులూ, టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులూ సంఘటితం కావడమే చంద్రబాబు హైదరాబాద్ పర్యటన అసలు ప్రయోజనం…కెసిఆర్ కు ఇదితెలియనిది కాదు. అయినా ఎప్పుడు స్విచ్ ఆన్ చేయాలో ఎప్పుడు ఆఫ్ చేయాలో ఆయనకు బాగాతెలుసు. బలహీనమౌతున్న కేడర్ ని ఉత్సాహపరచడానికి బాబుని ఓ మాట అనాలన్నది కెసిఆర్ ఎంచుకున్న తాజా ఎత్తుగడ. అభిమానాలూ, ఆగ్రహాలు కాదు రాజకీయాల్లో ఎత్తుగడలు మాత్రమే వుంటాయని కెసిఆర్ మళ్ళీ నిరూపించారు.
మధ్యతరగతి కుటుంబాల నుంచి ఇంటికో మనిషో, అతిదగ్గర బంధువో హైదరాబాద్ లో బతుకుతున్న నేపధ్యంలో ”బాబుకి ఇక్కడ ఏం పని” అన్నమాట సీమాంధ్ర మనసును చివుక్కుమనిపించింది. ఈ గాయాన్ని అక్కడున్న మనవాళ్ళు ఓటింగ్ ద్వారా ఉపశమింప జేస్తారన్న ఆశ కూడా తలఎత్తుతుంది. ప్రతీచర్యకూ ప్రతిచర్య వుంటున్నది బౌతిక సూత్రమే కదా!
ఎలాగూ తెలుగుదేశం తెలంగాణాలో అధికారంలోక రాదు కాబట్టి కెసిఆర్ తో సర్దేసుకోవాలా లేక ఓటు హక్కుద్వారా ఒక్కసారైనా కసి తీర్చుకోవాలా అన్నదే సీమాంధ్ర సెటిలర్ల ముందున్న ప్రశ్న! ఫిబ్రవరి 2న 7,757 కేంద్రాల్లో 70,66,000 మంది ఓటర్ల పోలింగ్ లో ఈ ప్రశ్నకు సమాధానం బయటపడుతుంది.