హైదరాబాద్ అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా మారుతోంది. శివారులకు వెళ్లినా కనీస సౌకర్యాలతో ఓ ఇల్లు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. కోటి వరకూ పెట్టాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్ లోపల చిన్న చిన్న బిల్డర్లు కట్టే అపార్టుమెంట్లు.. వెయ్యి SFTలోప ఉండేవి కూడా 70 లక్షలకు తక్కువ ఉండటం లేదు. ఇక కాస్త బ్రాండెడ్ బిల్డర్లు, రెరా నిబంధనలతో కట్టే ఇళ్లు అయితే రూ. కోటి దాటిపోయాయి.
కోటి రూపాయల ధరల శ్రేణి ఇళ్లకు డిమాండ్ ఏమీ తక్కువ ఉండటం లేదు. కోటి రూపాయలు మించి ధర ఉన్నఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వరకు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. 50 లక్షల నుంచి కోటి లోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు గ తగ్గాయి. కోటి నుంచి కోటిన్నర రూపాయల ప్రైస్ రేంజ్లో ఇళ్ల అమ్మకాలు గత యేడాది ఇదే సమయంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగ్గాయని రికార్డులు చెబుతున్నాయి. అందుకే బిల్డర్లు కూడా ఎక్కువగా కోటిపైన ఉండే ఇళ్ల నిర్మాణానికే ప్రాదాన్యం ఇస్తున్నారు.
Read Also : అద్దె ఇల్లు మంచిదా ? సొంత ఇల్లా ?
ప్రైవేట్ ఉద్యోగులు 50 నుంచి 70 లక్షల బడ్జెట్లో ఇల్లు కొనుక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. దొరకడం లేదు. లోన్లు అంతకుమించి ఇవ్వాలంటే బ్యాంకులు తిప్పలు పెడుతున్నాయి. నగరం శివారు ప్రాంతాల్లోనూ ఇళ్ల ధరలు మండిపోతున్నాయి. నగర శివారు అయిన నారపల్లి, కొర్రెములలాంటి ప్రాంతాలు.. ఉప్పల్ నుంచి తొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. అయితే ఇక్కడ వెలసిన వెంచర్లలోనూ 90 లక్షలకు తక్కువగా ఎవరూ ధరలు చెప్పడం లేదు. ముంబై హైవేలో ఇస్నాపూర్, సంగారెడ్డి వరకూ వెళ్లినా అవే ధరలు. బెంగళూరు హైవే వైపు వెళ్తే.. ఇంకా ఎక్కువ రేటు పెట్టాల్సి వస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఇల్లు కొనాలి అంటే మధ్యతరగతివారికి ఒక్క జీవితం సరిపోదు అన్నట్టుగా ఉంది. సిటీ రోజురోజుకు అభివృద్ధి కావడం, కోర్ సిటీకి మెట్రో కనెక్టివిటీని మెరుగుపరచడం వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రబావితం చేస్తున్నాయి.
హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఐటీ కారిడార్ పరిసరాల్లో కోటి నుంచి కోటిన్నర రూపాయల ఇళ్లకి భారీ డిమాండ్ ఉంటోంది. నానక్ రాంగూడ, నార్సింగి, పుప్పాలగూడ, గచ్చిబౌలి, కోకాపేట్, గండిపేట్, కొండాపూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో కోటి నుంచి రెండు కోట్ల మధ్య ధరలున్న ఇళ్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఇక్కడ మధ్యతరగతి వారు ఎవరూ కొనేంత సాహసం చేయలేరు.