భారతదేశంలో గొప్ప నగరాలు ఏవని అడిగితే అందరూ డిల్లీ, ముంబై, కోల్ కత, చెన్నై, పూణే, చండీఘడ్ అంటూ గడగడ లిస్టు చదివేసి వాటిలో చివరిగా హైదరాబాద్ పేరు చెపుతుంటారు. కానీ దేశంలో నెంబర్ :1 స్థానంలో హైదరాబాద్ నిలిచింది. పైన పేర్కొన్న నగారాలన్నీ ఆ లిస్టులో చాలా వెనుకబడున్నాయని మెర్సర్ అనే అంతర్జాతీయ సంస్థ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 230 నగరాలను సర్వే చేసి వాటిలో నాణ్యమయిన జీవనానికి అత్యంత అనువుగా ఉన్న నగరాల జాబితాను తయారు చేసింది.వాటిలో హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్: 1 స్థానంలో అంతర్జాతీయ స్థాయిలో 138వ స్థానాన్ని దక్కించుకొంది. అంతర్జాతీయ స్థాయిలో పూణే-144, బెంగళూరు-145, చెన్నై-150, ముంబై-152, కోల్ కతా-160, డిల్లీ-161వ స్థానాలు దక్కించుకొన్నాయి.
ఇక విదేశాలలోని నగరాలలో ఆస్ట్రియా రాజధాని వియన్నా మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా స్విట్జర్ ల్యాండ్ లోని జ్యూరిచ్, న్యూజిల్యాండ్ లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వెంకోవర్ నగరాలు నిలిచాయి. ఈ జాబితాలో సింగపూర్-26, మలేషియా రాజధాని కౌలాలంపూర్- 84, చైనా రాజధాని బీజింగ్-118, శ్రీలంక రాజధాని కొలంబో-132 స్థానాలలో నిలిచాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో అంటే నెంబర్: 280లో నిలిచింది. ఈ జాబితాను పరిశీలించినట్లయితే భారత్ లో ఏ నగరం కన్నా గత మూడు,నాలుగు దశాబ్దాలుగా ఎల్.టి.టి.ఈ.ఉగ్రవాదులతో వేగిన శ్రీలంకలో కొలంబో మిన్నగా ఉందని అర్ధమవుతోంది.