తెలంగాణలో ఐటీ దాడులు ఆషామషీగా జరగడం లేదని స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న వాసవి గ్రూప్‌పై దాడులు చేయగా.. ఇవాళ ఫీనిక్స్ గ్రూప్‌ను టార్గెట్ చేశారు. వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల్ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్న ఈ సంస్థలు జాయింట్ వెంచర్లు కూడా వేశాయి. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చాలా వరకూ ఈ కంపెనీలతో లావాదేవీల్లో మునిగి ఉన్నారని చెబుతున్నారు. భూములు… అనుమతులు..ఇలా ప్రతీ దానికి వీరికి ప్రత్యేకమైన యాక్సెస్ ఉంటుందని చెబుతున్నారు.
వాసవి గ్రూప్‌లో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలతోనే ఫీనిక్స గ్రూప్‌లో సోదాలు చేసినట్లుగా భావిస్తున్నారు. ఫీనిక్స్ గ్రూప్ చైర్మెన్ సురేష్ చుక్కపల్లి. ఆయనకు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారు. రాజకీయ విమర్శలు అనే అవకాశం లేకుండా ఐటీ దాడులు జరుగుతూండటంతో.. తెలంగాణ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఫీనిక్స్ గ్రూపు… వాసవి గ్రూపు సంయుక్తంగా నిర్మిస్తున్నఓ బడా ప్రాజెక్టును… ఏపీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతకు చెందిన స్థలంలో నిర్మిస్తున్నారు.
దీనిపై ఈడీ కూడా కన్నేసింది. గతంలో విచారణ చేయించాలని సిఫార్సు చేసిన పత్రాలు బయటకు వచ్చాయి. కానీ పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు అలా సోదాలు చేయడం కలకలం రేపుతోంది. ముందు ముందు ఐటీ సోదాలు ఇంకా జరుగుతాయని.. గుట్టు అంతా బయటకు లాగే దాకా రాజకీయ లింకులు బయటకు రానివ్వరని అంటున్నారు.