హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వల్పంగా సింప్టమ్స్ ఉండటంతో.. టెస్టు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని తెలియడంతో.. హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. ఆయన కుటుంబసభ్యులందరూ టెస్టులు చేయించుకున్నారు. వారందరికీ వైరస్ సోకలేదని తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న మేయర్ రామ్మోహన్… అధికారులతో సమీక్షలు నిర్వహించి… పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. పారిశుద్ధ్యంతో పాటు.. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దీంతో మేయర్.. కరోనా సోకినప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
హైదరాబాద్ మేయర్ గతంలో.. రెండు, మూడు సార్లు కరోనా పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టుల లిస్టులో ఉన్నారు. ఓ సారి అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వెళ్లి… టీ స్టాల్లో టీ తాగారు. తర్వాత ఆ టీ మాస్టర్ కు కరోనా అని తేలింది. తర్వాత మేయర్.. డ్రైవర్ వ్యక్తిగత సిబ్బందికి కూడా పాజిటివ్ అని తేలింది. అలాంటి సందర్భాల్లో… ప్రైమరీ కాంటాక్ట్‌గా తనకు తాను స్వచ్చందంగా పరీక్షలు చేయించుకున్నారు బొంతు రామ్మోహన్. ఇప్పుడు… సింప్టమ్స్ కనిపించిన తర్వాత టెస్టు చేయించుకోవడంతో వైరస్ బయటపడింది.
ఇటీవల కేటీఆర్ పాల్గొన్న పలు కార్యక్రమాల్లో.. మేయర్ పాల్గొన్నారు. ఫ్లైఓవర్ శంకుస్థాపన… నీరా స్టాల్ శంకుస్థాపన సహా.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే. అధికార సమీక్షలు కూడా.. చాలా చురుకుగా నిర్వహించారు. ఇప్పుడు… ఆయనతో కాంటాక్టులో ఉన్న వారంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తున్న సమయంలో.. ఏకంగా మేయరే వైరస్ బారిన పడ్డారు.