హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..?
అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని…2026 తర్వాత విక్రయించాలనుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్ స్పష్టం చేశారు. 65ఏళ్ల వరకు సంస్థను విక్రయించేందుకు వీలు లేదన్న ఆయన ఎల్ అండ్ టీకి వస్తోన్న నష్టాల నేపథ్యంలో మెట్రో అమ్మకానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
సంస్థకు గణనీయమైన నష్టాలు వస్తుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా ఓ ఛానెల్ తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వలన ఎక్కువగా పురుషులే మెట్రోలో ప్రయనిస్తున్నారని, మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిందన్నారు. అలాగే, ఊబర్ , ఓలా, రాపిడో వంటి సంస్థల వలన కూడా మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తోన్న లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అయితే, గతంలో కూడా ఇలాగే నష్టాల పేరుతో అమ్మకానికి సిద్దమైందని లీకులు ఇవ్వడంతో ఎల్ అండ్ టీకి ప్రభుత్వం అనేక సబ్సిడీలను కల్పించడంతో నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మెట్రోలో రోజురోజుకూ రద్దీ పెరుగుతున్నా మళ్లీ నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టీ వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలోలాగే ఇప్పుడు కూడా అలాంటి సబ్సిడీల కోసమే మెట్రో అమ్మకమంటూ ఎల్ అండ్ టీ లీకులు ఇస్తుందా..? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.