హైదరాబాద్‌కే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న మెట్రో సర్వీసులకు గండం పొంచి ఉంది. ఎల్ అండ్ టీ సంస్థ ఇక మా వల్ల కాదని తేల్చేసింది. ప్రభుత్వానికి చెప్పేసింది. ఇదే మొదటి సారి కాదు.. కరోనా రాక ముందుకూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో వదిలేయడానికి సిద్ధపడింది. అప్పుడు ఎలాగో సర్దుబాటు చేశారు.కరోనా వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. రోజుకు కోట్లలోనే నిర్వహణ నష్టం వస్తోంది. దీన్ని భరించడం సాధ్యం కావడం లేదు. మరో వైపు ప్రభుత్వం ఆదుకోవడం లేదు. దీంతో ఎల్ అండ్ టీ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది.
హైదరాబాద్ మెట్రో ఆగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు అని..ఎలాగైనా సరే కాపాడుకుందామని ప్రభుత్వం చెబుతోంది. మంత్రివర్గ సమావేశంలో మెట్రోపై సుదీర్ఘంగా చర్చించారు. కానీ ఎల్ అండ్ టీకి ఎలాంటి సాయం చేయాలన్న విషయం పై స్పష్టత రాలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటైన హైదరాబాద్ మెట్రోలో ఎల్అండ్టీకి 90 శాతం వాటా ఉండగా, 10 శాతం వాటా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉంది. 2019 – 20లో రూ.383 కోట్ల నష్టాలను చవిచూసింది. 2020 21లో ఏకంగా రూ.1,766 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.
కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడంతో కంపెనీకి అసలు, వడ్డీ చెల్లింపులు భారంగా మారాయి. ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్‌తో భవిష్యత్తులోనూ ప్రయాణికుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో రూ.5 వేల కోట్ల రుణసాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎల్అండ్టీ కోరింది. కానీ, దీనిపై ప్రభుత్వ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో తన వాటాను అమ్ముకోవడమే మేలని ఎల్అండ్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.