మెట్రో రైల్లో ప్రయాణం. హైదరాబాద్ ప్రజలను ఈ అదృష్టం ఎప్పుడు వరిస్తుందో అంతుపట్టడం లేదు. గడువు పెరుగుతూనే ఉంది. అంచనా వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. అనుకోని అవాంతరాలు, వివాదాలు, ఇతర కారణాల వల్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయి.
మెట్రో పనులను ప్రారంభించిన 2010 దీని అంచనా వ్యయం 12 వేల 132 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ప్లాన్ లో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. అనుకున్నదానికంటే ప్రాజెక్టు ఆలస్యమైంది. పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఫలితంతా ప్రాజెక్టు అంచనా వ్యయం 16 వేల 375 కోట్లకు చేరింది. పోనీ ఈ బడ్జెట్లో అయినా పూర్తవుతుందా అదీ గ్యారంటీ కాదు.
మెట్రో నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ అండ్ టి అధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు చాలా ప్రాంతాల్లో పనులు దాదాపుగా నిలిచిపోయాయి. సుల్తాన్ బజార్, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో రూటు మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్లాన్ లోని రూటు మారింది. కొత్త రూటు వల్ల దూరం పెరిగింది. ఈలోగా పలు చోట్ల నిరసనలు. పైగా ప్రజాహిత పని కోసం స్థల సేకరణకు భారీగా పరిహారం చెల్లించాల్సి వస్తోంది. ఇది తలకు మించిన భారంగా ఉందనేది ఎల్ అండ్ టి వాదన. కాబట్టి ప్రభుత్వం కొంత సహాయం చేయాలని కోరుకుంటోంది.
సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఒక సమస్య వల్ల పని నెమ్మదిగా జరుగుతోంది. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో రూటుపై కొంత కాలం తర్జనభర్జనలు. ఇక పాతబస్తీలో అయితే ముందు అనుకున్న ప్లాన్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ సద్దుమణిగేటప్పటికి పుణ్య కాలం కాస్తా గడిచిపోయింది. చాలా ఆలస్యమైంది.
నిజానికి మెట్రో మొదటి దశ జులై 17న ప్రారంభం కావాలి. అది అసాధ్యమని చాలా కాలం క్రితమే అర్థమైంది. ఖర్చు పెరగడం, ప్లాన్ మారడం, తదితర కారణాల వల్ల 2018 డిసెంబర్ 31 లోపు పూర్తి చేయడం అసాధ్యమని ఎల్ అండ్ టి అధికారులు ఇటీవలే ప్రకటించారు. పోనీ తాజా గడువు ప్రకారమైనా పనులు పూర్తవుతాయా అంటే అనుమానంగానే ఉంది. పనులు ఆలస్యమయ్యే కొద్దీ వ్యయభారం పెరుగుతోంది. ఎల్ అండ్ టి కంపెనీ అంచనా ప్రకారం, పని ఆలస్యం వల్ల రోజుకు 5 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. కాబట్టి అంచనా వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది చివరికైనా హైదరాబాదీలు మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం వస్తుందా అంటే అనుమానమే.