మొత్తానికి మెట్రో రెడీ అయిపోయింది. 28న ప్రారంభం అయ్యి, 29 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న మెట్రో రైలు సర్వీసులపై అందరికీ ఆసక్తి నెలకొంది. జర్నీ ఎంతో సులభం , జర్నీ టైం కూడా తక్కువ, పొల్యూషన్ లేకుండా హ్యాపీగా వెళ్లిపోవచ్చని అందరూ ఖుషీ అవుతున్నారు. అయితే మెట్రో రైలులో జర్నీకి కఠిన నిబంధనలు ఉన్నాయి. వీటిని ఫాలో కావాల్సిందే. లేకపోతే జరిమానా తప్పదు.
ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి :
MMTS లోకల్ ట్రెయిన్ లో చాలా మంది కింద కూర్చొనే ప్రయాణిస్తూంటారు. కానీ మెట్రో రైలులోకి ప్రవేశించగానే సీటు ఉంటే అందులో కూర్చోవచ్చు. లేకపోతే నిలబడాలి. అంతేగానీ కింద కూర్చుంటాను అంటే కుదరదు. కింద కూర్చుంటే జరిమానా వేస్తారు.
ఒక్కో టికెట్ పై కేవలం 10కేజీల వరకు మాత్రమే లగేజీకి అనుమతి ఇస్తారు. ఆపై ప్రతి కిలోకి రూపాయి లగేజీ చార్జ్ వసూలు చేస్తారు. అది కూడా గరిష్టంగా 40కిలోలు మాత్రమే.
బ్యాగ్ పొడవు 60 సెంటిమీటర్లు, వెడల్పు 45 సెంటిమీటర్లు, ఎత్తు 25 సెంటిమీటర్లలోనే మీ 40కిలోల బ్యాంగ్ ఉండాలి. పెద్ద పెద్ద గోతాలు వేస్తాం అంటే అనుమతించరు. అసలు ఎంట్రీనే ఉండదు.
మెట్రో టికెట్ కొనుగోలు చేసిన 29 నిమిషాల్లోపు స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ పైకి ఎంట్రీ అవ్వాలి. టికెట్ కొన్నాం కదా అని అర గంట తర్వాత వెళితే చెల్లుబాటు కాదు. మళ్లీ టికెట్ కొనుగోలు చేయాలి.
అందంగా ఉన్నాయి.. చల్లగా ఉంది.. హాయిగా ఉంది కదా అని మెట్రో స్టేషన్లు, మాల్స్ లోనే ఉండిపోతాం అంటే అస్సలు ఊరుకోరు. రెండు గంటల వరకు మాత్రమే మీకు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జరిమానా విధిస్తారు. టోకెన్లు, స్మార్ట్‌కార్డులు లేకపోయినా, తీసుకున్న టోకెన్ సమయం గడిచిపోయినా జరిమానా విధిస్తారు. దీని కోసం మెట్రో ఎంట్రీ నుంచి అడుగడుగునా సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు తిరుగుతూనే ఉంటారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా గంటల తరబడి అక్కడే ఉంటుంది గుర్తించి బయటకు పంపిస్తారు.
రద్దీ సమయాల్లో టోకెన్లు ఇచ్చేందుకు వీలుగా పోర్టబుల్ టికెట్ అనలైజర్ (PTA) మిషన్ తో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రతి మెట్రో స్టేషన్లో సిబ్బంది తిరుగుతూ ప్రయాణీకులను తనిఖీలు చేస్తుంటారు.
ప్రతి మెట్రో స్టేషన్‌ను.. పబ్లిక్ ఏరియా, ప్రైవేట్ ఏరియా, ప్లాట్‌ఫామ్ మూడు భాగాలుగా విభజించారు. పబ్లిక్ ఏరియాలోకి ఎవరైనా వెళ్లొచ్చు. ప్రైవేట్ ఏరియాలోకి మాత్రం టికెట్ ఉండాల్సిందే. అక్కడి నుంచి ఫ్లాట్ ఫాంపైకి వెళ్లొచ్చు.
స్మార్ట్‌కార్డు ఉన్నవారికి కూడా ఈ కాలపరిమితి నిబంధనలు వర్తిస్తాయి. రెండు గంటలకు మించి ఉంటే.. బయటకు వెళ్లేటప్పుడు కార్డ్ స్వైప్ చేయగానే ఆ విషయం బయటపడుతుంది.
మెట్రో స్టేషన్లో టికెట్ క్యాష్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. టిక్కెట్ల సమయాన్ని, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు స్టేషన్లో రీడర్లను ఏర్పాటు చేశారు. టికెట్‌ను మిషన్ పై ఉంచగానే మొత్తం సమాచారం తెలుసుకోవచ్చు.
అగ్గిపెట్టెలు, లైటర్లు, గ్యాస్ సిలిండర్లు, కిరోసిన్, పెట్రోల్ వంటి నిషేధిత ఇంధనాలు, వస్తువులు నో ఎంట్రీ. ఫ్రూట్స్ కట్ చేసే చిన్న చాకును కూడా అనుమతి ఇవ్వరు.
మీరు మెట్రో జర్నీ చేయాలి అనుకుంటే ఈ నిబంధనలు పాటించి తీరాల్సిందే. లేకుంటే అక్కడి వరకు వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కఠినంగా అమలు అవుతాయి. ఏ మాత్రం వెసలుబాటు ఉండదు. సో.. మెట్రో జర్నీ చేద్దాం అనుకున్న వారు వీటిని ఫాలో అయి తీరాల్సిందే!!!