హైదరాబాద్ మెట్రో రెండో దశకు రేవంత్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది . నిధులు ఎలా సమీకరించుకోవాలో కూడా అందులో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం నిధులు అంటే దాదాపుగా ఏడు వేల కోట్లకుపైగా సమకూరుస్తుంది. పద్దెనిమిది శాతం కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మిగిలిన నిధుల్ని రుణాలు, పీపీపీ పద్దతిలో సేకరిస్తారు. అంటే.. మెట్రో రెండో దశలో కేంద్రం మద్దతు తప్పనిసరి అని అనుకోవాల్సిందే.
మెట్రో మొదటి దశ పూర్తి అయి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకూ రెండో దశ గురించి కనీస ప్రస్తావన లేదు. హైదరాబాద్ మెట్రో చాలా పరిమితమైన ప్రాంతంలోఉంది. దీని వల్ల ట్రాఫిక్ కొంత వరకు తగ్గుతోంది కానీ ప్రజావసరాలను తీర్చే విషయంలో ఏ మాత్రం సరిపోదు. శివారు ప్రాంతాలకూ మెట్రో విస్తరిస్తేనే నగరం విస్తరిస్తుంది. అందుకే రెండో దశపై ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు.
కేంద్రానికి మెట్రో రైల్ పాలసీ ఉంటుంది. ఆ ప్రకారం సహకరిస్తే రెండో దశ వెంటనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి .. కేంద్రంతో పరిపాలనా విషయంలో సఖ్యతగానే ఉంటున్నారు. ఈ పరిపాలనా అనుమతులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకుని పనులు ప్రారంభిస్తే హైదరాబాద్కు అదో గొప్ప మలుపు అవుతుందనుకోవడంలో సందేహం లేదు.
శివారు ప్రాంతాల్లో రియల్ కార్యకలాపాలు పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మెట్రో జీవోలు విడుదల చేయడంతో పాటు పనులు ప్రారంభించడం కూడా చాలా కీలకం.