హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం రెడీ అయింది. మార్చి 20 నుండి త్త భవనం నుంచి మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తారు. నానక్‌రామ్ గూడాలో విశాలమైన భవనాన్ని నిర్మించారు. ఈ కాన్సులేట్ భవనం నుండి కాన్సులర్ సేవలను అందించనున్నారు. కొత్త కాన్సులేట్‌లో సేవలు మార్చి 20న ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని బేగంపేట దగ్గర ఉన్న పైగా ప్యాలెస్‌లో ఆఫీసు కార్యకలాపాలు మార్చి 15 మధ్యాహ్నం 12 గంటలకు ఆపేయనున్నారు. కాన్సులేట్ మార్చి 15 మధ్యాహ్నం 12 నుండి మార్చి 20 ఉదయం 8.30 వరకు మూసివేస్తారు.
మార్చి 8, 15 మధ్య వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన దరఖాస్తుదారులకు ఇంటర్యూలు పైగా ప్యాలెస్‌లోనే జరుగుతాయి. మార్చి 23న లేదా ఆ తర్వాత వీసా ఇంటర్వ్యూ ఉన్న వారు నానక్‌రామ్‌గూడాలోని US కాన్సులేట్ కొత్త ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అపాయింట్మెంట్లు, ”డ్రాప్‌బాక్స్”అపాయింట్మెంట్లు ఇంటర్వ్యూ లకు మినహాయింపు ఉన్నవారికి అందించే సేవలు, పాస్‌పోర్ట్ పికప్ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాదాపూర్ లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయని కాన్యులేట్ కార్యాలయం వివరించింది. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల నుంచి చదువులకోసం ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీంతో అమెరికా ప్రభుత్వం సొంత కాన్సులేట్ నిర్మించుకుంది. పూర్తిగా అమెరికా స్టైల్ లో అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లతో ఈ కాన్సులేట్ ను నిర్మించింది.