కందుకూరు అంటే చాలా మందికి ప్రకాశం జిల్లా కందుకూరు గుర్తుకు వస్తుంది. కాని హైదరాబాద్ శివారులోనూ ఓ కందుకూరు ఉంది. నిజానికి ఓ ఇరవై ఏళ్ల కిందట ఇది హైదరాబాద్ శివారు కూడా కాదు. ఓ గ్రామం. ఎవరికీ తెలియదు. కానీ హైదరాబాద్ విస్తరణ.. ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడు అయితే ప్రణాళికల్లోకి వచ్చిందో అప్పటి నుంచి మెల్లగా రియల్ ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో ఎవరూ ఊహించని అభివృద్ధి చూడబోతోంది.
ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత కందుకూరు చుట్టుపక్కల లావాదేవీలు పెరిగాయి. అయితే ఫార్మాసిటీ ఏర్పాటవుతుందంటూ గత ప్రభుత్వం ఏడేళ్ల క్రితం ప్రకటించినప్పటి నుంచి హడావుడి పెరిగింది. కందుకూరు చుట్టుపక్కల మండలాల్లో ఓఆర్ఆర్ సమీపంలో భారీగా రియల్ వెంచర్లు వెలిశాయి. భూముల ధరలూ భారీగా పెరిగాయి. తాజాగా మరోసారి ఫోర్త్ సిటీని రేవంత్ ప్రకటించారు. అంతే కాదు ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ జంక్షన్ కూడా రాబోతోంది. దాంతో ఇక అభివృద్ధికి తిరుగు ఉండదని భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ కందుకూరు ఎలా చూసినా హైదరాబాద్ కు దూరమే కానీ ప్రభుత్వం నిర్మాణం తలపెట్టిన ఫోర్త్ సిటీకి పునాదులు పడిన తర్వాత చాలా దగ్గర అయిపోతుంది. అంత డిమాండ్ పెరిగే అవకాశాలు. ఇప్పటికీ అక్కడ ఎకరాల చొప్పున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. వాటిని వెంచర్లుగా వేసి అమ్ముతున్నారు. స్థిరమైన పెట్టుబడికి కందుకూరు వద్ద ఓ చిన్న స్థలం కొనుక్కున్న మంచి రిటర్నులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.