కృష్ణానదిలో వరద ఎప్పుడు వస్తుందో… కరువు ఎప్పుడొస్తుందో… ఎవరూ చెప్పలేరు. నెల రోజుల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టులన్నీ నిండిన సందర్భాలున్నాయి. కానీ, గోదావరి అలా కాదు. మినిమం గ్యారెంటీ వాటర్ ఉంటుంది. గోదావరి, ఉప నదుల నుండి ఎంతో కొంత వరద వస్తుంది.
కానీ, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ దాదాపు డెడ్ స్టోరేజ్ లోనే ఉన్నాయి. తాగునీటి అవసరాలకు తప్పా సాగు కోసం చుక్క నీరు వాడుకునే పరిస్థితులు కనపడటం లేదు. గోదావరి బేసిన్ లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం దాదాపు 30టీఎంసీలు. గత ఏడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 18.43టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది కేవలం 13.57 టీఎంసీలే ఉంది.
ఇక ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అయిన ఎస్పారెస్సీ పరిస్థితి మరీ ఘోరం. 90టీఎంసీల ఎస్సారెస్పీలో కేవలం 14టీఎంసీల నీరే ఉంది. పోయిన ఏడాది ఇదే సమయానికి 30టీఎంసీల పైగా నీరుంది. ఇక నిజాం సాగర్ పరిస్థితి కూడా అంతే. 17..8టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో కేవలం 3టీఎంసీల వాటరే ఉంది.
హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కు కీలకమైన ప్రాజెక్టులు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు. ఎల్లంపల్లి 20టీఎంసీలకు గాను 5టీఎంసీల నీరుండగా, 27టీఎంసీల మిడ్ మానేరులో 5.55టీఎంసీల నీళ్లు, 24టీఎంసీల కెపాసిటీ ఉన్న లోయర్ మానేరులోనూ 5టీఎంసీల నీరే ఉంది. అంటే వర్షాలు మెరుగ్గా పడకున్నా, పై నుండి వరద రాకపోయినా… హైదరాబాద్ కు తాగునీటి కష్టాలు మొదలైనట్లే.