కర్నూలు జిల్లా టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్ సమీప బంధువుల్ని ఓ భూవివాదం నేపధ్యంలో రాత్రి కిడ్నాప్ చేశారు. ఆ ఘటన కలకలం రేపింది. ఐటీ అధికారుల పేరుతో ఇళ్లలోకి వచ్చి.. వారిని తీసుకెళ్లారు. వారితో.. భూమా కుటుంబానికి భూ వివాదం ఉండటంతో వారే చేసి ఉంటారన్న కోణంలో పోలీసులు చురుగ్గా.. విచారణ జరపడంతో వ్యవహారం బయటకు వచ్చింది. భూమా అఖిలప్రియ భర్త.. భార్గవరామ్ సోదరుడు ప్రత్యక్షంగా ఈ కిడ్నాప్ ఘటనలో పాలు పంచుకున్నట్లుగా భావిస్తున్నారు. రాత్రే పోలీసులు వారిని అరెస్ట్ చేయగా… ఇప్పుడు నేరుగా అఖిలప్రియనే అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో అఖిలప్రియహస్తం ఉందో లేదో క్లారిటీలేదు కానీ.. ఆమె భర్త పరారీలో ఉండటంతో ఆెను అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లిలోని ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఆమెను మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నించే అవకాశం ఉంది. భార్గవరామ్ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారని మొదట ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం… భార్గవరామ్ పరారీలో ఉన్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఓడిపోయినప్పటికీ.. రాజకీయంగా చురుగ్గానే ఉన్నారు.
ఆమెపై కర్నూలు జిల్లాలోనూ పలు వివాదాలు వచ్చాయి. భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న సుబ్బారెడ్డిని చంపించడానికి ఆమె సుపారీ ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పోలీసులు తనకు చెప్పారని సుబ్బారెడ్డి నేరుగా మీడియా ఎదుట ఆరోపించారు. ఆ తర్వాత నంద్యాల నియోజకవర్గంలోనూ జరిగిన ఓ హత్య విషయంలో ఆమెకు… ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. భూమా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత ఆ వారసత్వాన్ని అఖిలప్రియ తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయి. సీఏం కేసీఆర్ బంధువుల్నే కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారంటే.. ఆ భూవివాదం చిన్నది కాదన్న చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలను పోలీసులు ప్రకటించాల్సి ఉంది.