విశాఖ సమీపంలో ఓ భారీ లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మామూలుగా అయితే కార్లలో తరలించేదానికే స్మగ్లర్లు టెన్షన్ పడుతూంటారు. కానీ ఇక్కడ మాత్రం నిత్యావసర వస్తువుల లోడ్ అయినట్లుగా గంజాయిని తరలించేస్తున్నారు. అయితే పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పట్టేసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే పట్టుకుంది ఏపీ పోలీసులు..విశాఖ పోలీసులు కాదు. హైదరాబాద్ పోలీసులు.
హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు విశాఖలో లారీని పట్టుకుని దాని నిండా ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది స్థానిక పోలీసులకు తలకొట్టేసినట్లయింది. ఎందుకంటే తాము పట్టుకోనందుకు కాదు.. తమ రాష్ట్రంలో కూడా సేఫ్ పాసేజ్ ఇవ్వలేకపోయినందుకని… అనుకోవచ్చు. ఏపీ గంజాయి కేపిటల్ గా మారిపోయిందని దేశవ్యాప్తంగా కోడై కూస్తోంది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా అది ఏపీ నుంచే వస్తోందని పోలీసులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ గంజాయిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, పాలకులు.. పైపై ప్రకటనలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ఏపీపై గంజాయి ముద్ర పడుతోంది.
తమ రాష్ట్రాలకు వస్తున్న గంజాయి గురించి సమాచారం రాగానే.. అక్కడిదాకా వచ్చేదాకా ఆగకుండా ఏపీకి వచ్చి ఆపరేషన్లు చేస్తున్నారు పోలీసులు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదు. అలా ఇస్తే ఏం జరుగుతుందో వారికితెలుసు. అందుకే అంతా అయిపోయాక సమాచారం ఇస్తున్నారు. ఈ పరిస్థితి పోలీసు శాఖ పని తీరును కూడా చులకన చేస్తోంది. ఇదేం ఖర్మ ఏపీకి అనుకోవడం తప్ప మరో చాయిస్ లేకుండా పోతోంది.