హైదరాబాద్ ఇప్పుడు ఏపీ విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలని చట్టంలో ఉంది. మరి ఆ తర్వాత తెలంగాణకు రాజధానిగా ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ కేంద్రం కొత్తగా ఆలోచిస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటోంది. దీనిపై స్పష్టమైన సంకేతాలు ఢిల్లీలో వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తర్వాత హైదరాబాద్ ను రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. పదేళ్ల పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజధానిగా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఆ గడువు 2024 జూన్ తో ముగుస్తుంది. సరిగ్గా ఈ తరుణంలో కేంద్రం కొత్తగా యూనియన్ టెరిటరీగా హైదరాబాద్ అంటూ పాత ప్రతిపాదననే తెరపైకి తీసుకువచ్చింది. ఇది రాజకీయంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కు సానుకూలం అని అంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఎంతగా ప్రయత్నించినా కనీస మాత్రమైన రాజకీయ బలాన్ని పెంచుకోవడంలో విఫలమైన బీజేపీ.. యూనియన్ టెరిటరీ పేరుతో కనీసం హైదరాబాద్ పై పెత్తనం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్న ఉద్దేశంతో ఆ దిశగా సీరియస్ గా దృష్టిపెట్టిందని భావిస్తున్నారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా కేంద్రం అంతర్గతంగా చర్యలు ప్రారంభిచిందని చెబుతున్నారు.
హైదరాబాద్ యూటీ అంటే తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వ్యతిరేకత వచ్చినా ఢిల్లీ తరహా అభివృద్ధి ఉంటుందన్న భావనలో హైదరాబాదీయులు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటెసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ కు నలువైపులా రక్షణ శాఖ భూములు ఉండటం, రక్షణ పరంగా హైదరాబాద్ అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఈ ప్రతిపాదనకు జాతీయ స్థాయిలో పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టం చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు.