హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తర్వాతే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, ఇండిపెండెంట్ హౌస్లు కావాలంటే రింగ్ రోడ్ అవతల మాత్రమే లభిస్తున్నాయి. విల్లా ప్రాజెక్టులు కూడా అత్యధికం ఔటర్ రింగ్ రోడ్ తర్వాతనే నిర్మిస్తున్నారు. పదేళ్ల కిందట ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఇల్లు అంటే.. అమ్మో అంతదూరమా అనుకునేవారు. ఇప్పుడు ఔటర్ లోపల మొత్తం నగరం అయిపోయింది. కొత్త ఇల్లు కావాలంటే రింగ్ రోడ్ దాటిపోవాల్సి వస్తోంది.
ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ముంబై హైవే, నాగపూర్ హైవే, విజయవాడ, శ్రీశైలం హైవేల దగ్గర నుంచి ఔటర్ ఎగ్జిట్ నుంచి చూస్తే లెక్కలేన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడేదో కొత్త నగరాలు కడుతున్నట్లుగా ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ధరలు కూడా నిలకడగా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి మధ్యతరగతికి అందుబాటులో ధరలు ఉన్నాయి. అపార్టుమెంట్లు అయితే చిరుద్యోగులు కూడా కొనేలా ఉంటున్నాయి. ఓ మాదిరి ఉద్యోగులు ఇండిపెండెంట్ హౌస్లు కొనుగోలు చేసుకోవచ్చు.
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ స్లంప్లో ఉంది. అందుకే ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయిన తర్వాత ధరలు స్థిరంగా ఉన్నాయి. పెరగడంలేదు. ఆరు నెలల తర్వాత పరిస్థితి ఇలా ఉండదని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ పనులు ప్రారంభమైతే.. ఇంకా జోరుగా రియల్ ఎస్టేట్ ఉంటుంది. అందుకే సౌలభ్యం ఉన్నవారు.. ఇప్పుడే ఓ ఇల్లో..ఇంటి స్థలమో.. అపార్టుమెంట్ కొనుక్కుంటే..మేలు జరుగుతుందని సలహాలిస్తున్నారు.