హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కరెక్షన్ టైం నడుస్తోంది. అమ్మకాలు తగ్గుతున్నాయి. కానీ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అసలు ధరలు పెరగడం వల్లనే అమ్మకాలు తగ్గుతున్నాయన్నది అసలు విషయం. హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం సిటీ అయిపోయింది . ఇప్పుడు ఔటర్.. ఇంకా పనులు ప్రారంభించని రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం కూడా హైదరాబాద్లో కలిపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. నగరం నలుదిక్కుల ఇళ్లు, భూములకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.
ఇదే సమయంలో రియాలిటీ సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్న ధరలతో ఇళ్లు ఇస్తే డిమాండ్ పెరిగేది. కానీ ధరలు పెంచి డిమాండ్ తగ్గించుకుంటున్నారు. ఇళ్ల ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితిని కల్పిస్తున్నారు. ఒక్క ఆరు నెలల కాలంలోనే హైదరాబాద్ లో ఇళ్ల ధరలు 30 శాతం పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు అంచనాలు వేశాయి. దేశంలో మరో ప్రాంతంలోనూ ఈ స్థాయిలో పెరగడం లేదు. డిమాండ్, నిర్మాణ వ్యయాలు పెరగడం, లగ్జరీ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి ఇళ్ల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి.
హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లుగా ఒక్క అపార్టుమెంట్ ప్రకటిస్తే… బుకింగులు రోజుల్లోనే పూర్తయిపోతాయి. ఎందుకంటే రియాల్టీ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. సొంత ఇల్లు ఆశతో ఎంతో మంది ఉన్నారు. కానీ మార్కెట్ రియల్టర్లు నేల విడిచి సాము చేస్తూండటం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని మార్కెట్ వర్గాలు విశ్లేషించుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది.