హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అనుకున్న విధంగా పుంజుకోవడం లేదు. ఆర్బీఐ రుణాల వడ్డీ రేట్లు తగ్గిస్తున్నా.. మార్కెట్ కు సానుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలతో పాటు స్థానిక పరిస్థితులు కూడా కారణం అవుతున్నాయి. భూముల ధరలు ఎవరూ ఊహించని విధంగా పెరిగాయి. ఓఆర్ఆర్ నుంచి పది కిలోమీటర్ల దూరం పోయినా గజం ముఫ్పై వేల రూపాయల వరకూ చెబుతున్నారంటే.. ఇక సామాన్యులు భూమిని కొనే స్థాయి లేనట్లే. ఇక డిమాండ్ ఎక్కడి నుంచి ఉంటుంది?
ఇప్పటికే అభివృద్ది చెందిన కాలనీల్లో అయితే గజం ఓఆర్ఆర్కు కాస్త దగ్గర అయినా 70 వేల నుంచి లక్ష వరకూ చెబుతూ ఉంటారు. అదే కాస్త కమర్షియల్ అయితే ఎంత చెబుతారో అంచనా వేయడం కష్టం. ఈ కారణంగా ప్రాజెక్టుల ఖర్చు పెరిగిపోతోంది. సహజంగానే ఈ పరిణామం వల్ల కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు. డిమాండ్ పడిపోతోంది. దాంతో మార్కెట్ డౌన్ అవుతోంది. ఇళ్ల స్థలాల ధరల్లో కరెక్షన్ రావాల్సి ఉందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. లాభాలు మాత్రమే చూసుకుంటున్న రియల్టర్లు బంగారం లాంటి మార్కెట్‌ను అధిక ధరలతో నిర్వీర్యం చేసుకుంటున్నామని గుర్తించలేకపోతున్నారు.
ఏ వెంచర్ చూసినా వచ్చే పదేళ్ల తర్వాత అయినా ఆ రేటుకు అమ్ముకోగలమా అన్న స్థాయిలో రేట్లు ఉంటాయి. ఓఆర్ఆర్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాజెక్టులో పాతిక వేల రూపాయల గజం అమ్ముతున్నారు. అక్కడ ఇళ్లు కట్టుకోవాలంటే ఓ పదేళ్లు లేదా ఇరవై ఏళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ అక్కడ ధరలు పెరిగే అవకాశం ఉండదు. రియల్టర్లు మార్కెట్ కు తగ్గట్లుగా వ్యవహరిస్తే మార్కెట్ ను కాపాడుకునేందుకే అవకాశాలు ఉంటాయని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.