హైదరాబాద్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల అమ్మకాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా ఓపెన్ ప్లాట్లు, బల్క్ గా ఎకరాలకు ఎకరాలు కొనుగోలు చేసేవారు తగ్గిపోయారు. దీంతో సహజంగానే రేట్లు స్థిరంగా ఉన్నాయి. గతం కంటే తగ్గించడం కష్టం కాబట్టి పెంచకుండా అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ డిమాండ్ ఉండటం లేదు. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత అవినీతి సొమ్ము ప్రవాహం తగ్గిపోవడమే అంటున్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ స్కాం డబ్బులతో హైదరాబాద్ శివారులోని విచ్చలవిడిగా బినామీ పేర్లతో భూములు కొన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఐడీ అధికారులు ఇప్పటికే .. కొన్ని లావాదేవీల్ని గుర్తించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి .. ఆయన కుటుంబ సభ్యులు, బినామీలు చేసిన భూలావాదేవీలు వందల ఎకరాల్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. వైసీపీ హాయంలో మద్యం, ఇసుక సహా ఆదాయం వచ్చే అన్ని అంశాల్లో నగదు లావాదేవీలే జరిగాయి. వాటిని భూముల్లో పెట్టుబడిగా పెట్టేవారని చెబుతున్నారు.
సాధారణంగా బహిరంగ మార్కెట్ లో ఎకరం రేటు ఐదు కోట్లు ఉంటే…. ప్రభుత్వ విలువ యాభై లక్షలు ఉంటుంది. ఇక్కడవైట్ లో యాభై లక్షలు చూపించి.. మిగిలిన నాలుగున్నర కోట్లు బ్లాక్ లో చెల్లించవచ్చు. ఇలాంటి అవకాశాల వల్లే రియల్ ఎస్టేట్ లోకి ఎక్కువగా బ్లాక్ మనీ వస్తుంది. బీఆర్ఎస్ హయాంలోనూ కొంత వ్యవస్థీకృత అవినీతి ఉందని.. అక్కడా ఇక్కడా కలిపి భూలావాదేవీల్లో రికార్డులు సృష్టించాయని విశ్లేషిస్తున్నారు. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై జరిగిన దాడుల్లో బహిరంగమార్కెట్లో ఐదు వందల కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి వారు ఎందరో ఉంటారు.
ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏపీలో .. మద్యం విధానం మారిపోయింది. ఇసుక విధానం కూడా మారిపోయింది. అదే సమయంలో వైసీపీ హయాంలో క్యాష్ పార్టీలుగా ఉన్న వారు ఇప్పుడు తాము చేసిన అవినీతిని దాచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ పెద్దలకూ అదే పరిస్థితి ఉంది. అందుకే.. భూలావాదేవీలు తగ్గిపోయాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.