భారత్లో రియాల్టీ అభివృద్ధిలో హైదరాబాద్ ను మించిన నగరం లేదని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ. నైట్ ఫ్రాంక్ తాజాగా చేసిన అభిప్రాయ సేకరణలో స్పష్టమయింది. ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ పేరుతో నైట్ ఫ్రాంక్ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో స్తబ్దత ఉన్నప్పటికీ హైదరాబాద్లోని ఉన్న ప్లస్ పాయింట్లతో భవిష్యత్లో దేశంలోనే అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని నైట్ ఫ్రాంక్ నివేదిక స్పష్టం చేసింది.
హైదరాబాద్లో ఐటీ, టెక్నాలజీ కంపెనీలు విడదీయరానంతగా స్థిరపడిపోయాయి. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, మెట్రో రైల్ విస్తరణతో వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్తో పోలిస్తే నగరంలో ఇళ్ల ధరలు కూడా తక్కువేనని నైట్ ఫ్రాంక్ గుర్తు చేసింది. ఇవన్నీ హైదరాబాద్ రియల్టీకి కలిసి వస్తున్నాయని భావిస్తున్నాయి.
ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి ఐదారు కిలోమీటర్ల దూరమైనా పెద్ద సైజు అపార్ట్మెంట్, విల్లా వంటి లగ్జరీ ఇళ్లను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్న ఎగువ మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు లగ్జరీ ఇళ్ల వైపు చూస్తున్నారు. మంచి గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణమూ ఉంటే లగ్జరీ విల్లాలు, ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.
ఇలాంటి ఇళ్లపై పెట్టే పెట్టుబడులకు మంచి రిటర్న్స్ ఉంటున్నాయి. గత ఏడాది నివాస గృహాల ధరలు 11 శాతం పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ ఇండియా చెబుతోంది. హైదరాబాద్ అన్ని రకాలుగా నివాసానికి అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అనేక నివేదికలు వెల్లడించాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా .. హైదరాబాద్ లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నైట్ ఫ్రాంక్ నివేదిక ఆ విషయాన్నే స్పష్టం చేసింది.