హైదరాబాద్: రెండేళ్ళ విరామం తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రియల్ ఎస్టేట్ రంగం మళ్ళీ పుంజుకుంటోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్లద్వారా వచ్చే ఆదాయం పెరగటమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఈ రిజిస్ట్రేషన్లు నగరంలోని కొద్ది ప్రాంతాలకే పరిమితమవటం విశేషం. ఇది మిగిలిన ప్రాంతాలకు వ్యాపించటానికి మరికొంత సమయం పడుతుందని రియల్ వ్యాపారులు అంటున్నారు.
ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీ నగర్, కొంపల్లి, మేడ్చల్, మహేశ్వరం, శంషాబాద్ ప్రాంతాలలో ప్రస్తుతం అమ్మకాలు, కొనుగోళ్ళు ఊపందుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గత ఏడాది ఏప్రిల్ – ఆగస్ట్ నెలలమధ్యలో రు.1,016 కోట్లు ఆదాయం గడించగా, అదే కాలానికి ఈ ఏడాది రు.1,392 కోట్లు గడించింది. అంటే 37% అభివృద్ధి కనిపిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య బాగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గత ఏడాది రు.493 కోట్లు గడించగా, ఈ ఏడాది రు.724 కోట్లు ఆర్జించింది. హైదరాబాద్ జిల్లాలో గత ఏడాది రు.191 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది రు.231 కోట్లు గడించింది.
గ్రేటర్ హైదరాబాద్లో 2013నుంచి రియల్ ఎస్టేట్ రంగం మందగించింది. కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ప్రకటించటం దీనికి ప్రధాన కారణం. హైదరాబాద్ పరిస్థితిపై అనిశ్చితి ఏర్పడటంతో ఆస్తుల కొనుగోళ్ళు, అమ్మకాలు దాదాపుగా స్తంభించిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకూడా ఈ పరిస్థితి కొనసాగింది. అయితే ఇప్పుడు ప్రజలలో నమ్మకం ఏర్పడటం వలన మళ్ళీ అమ్మకాలు, కొనుగోళ్ళు పెరిగాయని రియల్ వ్యాపారులు అంటున్నారు. వరంగల్ హైవే వెంబడి ఉన్న ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలలో ఇప్పుడు డిమాండ్ బాగా ఉందని చెబుతున్నారు. ఉప్పల్లో రిజిస్ట్రేషన్లు బాగా పెరగటమే దీనికి ఉదాహరణ అంటున్నారు. మరోవైపు – ఒకప్పుడు అత్యధిక డిమాండ్ ఉన్న శేరిలింగంపల్లి ప్రాంతంలో ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ల శాతంలో ఎలాంటి పురోగతి లేకపోవటం విశేషం.