కొత్త ఏడాదిలో హైదరాబాద్ రియాలిటీ పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో రిజిస్ట్రేషన్ల జోరు కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది వివిధ కారణాలతో ఇళ్ల కొనుగోలు వైపు ఆసక్తి చూపని ప్రజలు కొత్త ఏడాదిలో తమ మనసు మార్చుకుంటున్నారు. హైదరాబాద్ లో డిమాండ్ కు తగినట్లుగా ఇళ్లు నిర్మాణంలోఉన్నాయి. పెరిగే డిమాండ్ కు తగ్గట్లుగా ప్రాజెక్టులు కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు.
పలువురు బిల్డర్లు మధ్యతరగతి ఆశలను తీర్చేందుకు డబుల్, త్రిబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. గత పది రోజులుగా రియల్ ఎస్టేట్ కార్యాలయాలకు ఎంక్వయిరీలు. పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న చిన్న మేస్త్రీలు కట్టే ఇళ్ల కోసం వాకబు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది వచ్చి పడిన సమస్యల్లో ఒకటి అయిన హైడ్రా కూడా పూర్తిగా భరోసా ఇస్తోంది. ఈ కారణంగా ఇళ్ల కొనుగోలుదారుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అనుకోవచ్చు.
తెలంగాణ ఆర్థికాభివృద్దికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంతో కీలకం. ఈ రంగానికి పూర్వ వైభవం వచ్చేలా చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఓపెనింగ్స్ అదుర్స్ అని క్లారిటీ వచ్చింది. ఇదే ఊపు కొనసాగితే.. హైదరాబాద్ రియాల్టీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉంది.