హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడానికి పాత ప్రాజెక్టులను పూర్తిగా అమ్మాల్సిన పరిస్థితుల్లో పడ్డాయి. అవి పూర్తిగా సేల్ కాకపోవడంతో కొత్త ప్రాజెక్టులకు నగదు కొరత ఏర్పడుతోంది. అందుకే రెడీ టు హ్యాండోవర్ ఉన్న ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు బంపరాఫర్లు ఇచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఐటీ కారిడార్, కోకాపేటల్లో నాలుగైదు బడా కంపెనీల ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి.హ్యాండోవర్ చేయడం ప్రారంభించి కూడా మూడు, నాలుగు నెలలు అవుతోంది. వాటిల్లో కనీసం 30 శాతానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోలేదు. వాటిని కొనుగోలు చేసేందుకు డిమాండ్ లేకపోవడంతో .. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేశారు. మంచి మంచి రాయితీలు ఇస్తామని సంకేతాలు పంపుతున్నారు.
ఓ లగ్జరీ అపార్టుమెంట్ లో ఫ్లాట్ కొనాలంటే పార్కింగ్ దగ్గర నుంచి మెయిన్టనెన్స్ వరకూ చాలా ఖర్చులు భరించాలి.వాటిలో రాయితీలు ఇచ్చేందుకు కంపెనీలు ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నారు. నేరుగా మూల ధరలో మాత్రం మార్పులు చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే అమ్మేసిన వాటితో పోలిస్తే తక్కువ ధరకు అమ్మితే అది చెడ్డ సంప్రదాయం అవుతుంది. మార్కెటింగ్ లో అది చాలా తప్పుడు పద్దతి కాబట్టి ఆ ధర జోలికి వెళ్లకుండా ఇతర సౌకర్యాల్లో ఫీజుల్లో తగ్గుదల.. అలాగే ఇతర ఆఫర్లు ఇస్తున్నాయి.
నేరుగా బేరమాడే సామర్థ్యం ఉంటే.. ఒక్క ఫ్లాట్ పై కనీసం ఐదు నుంచి పది లక్షలు రాయితీ సంపాదించుకోగలిగిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎంతో కొంత అని అమ్ముకునే స్థితిలోనే ఆయా కంపెనీలు ఉన్నాయి.