హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం తగ్గించాయి. పనులు అనుకున్నంతగా ఫాస్ట్ గా జరగడం లేదు. దీనికి కారణాలపై అనేక చర్చలు జరుగుతున్నాయి కానీ ప్రధానంగా మనీ రొటేషన్ అయ్యే పరిస్థితులు ప్రతికూలంగా మారడమే కారణమని ఎక్కువ మంది అంచనాకు వస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచక ముందు ఇళ్ల డిమాండ్ పీక్స్‌లో ఉండేది. పెద్ద ఎత్తున బుకింగ్స్ అయ్యేవి. కానీ ద్రవ్యోల్బణం పేరుతో వడ్డీ రేట్లను 9 కన్నా పై స్థాయికి చేర్చడంతో చాలా మంది కొనుగోలుదారులు ఇళ్ల కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గారు. వేచి చూడటం మంచిదని అనుకున్నారు.
తర్వాత హైడ్రా, ఇతర సమస్యలు కలసి వచ్చి ఇంకా వారంతా ఇళ్లు కొనాలన్న దానిపై ముందడుగు వేయడం లేదు. గత నెల రోజులుగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు కానీ పూర్తి స్థాయి డిమాండ్ అందుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే చాలా కంపెనీలు ఇలా బుకింగ్స్ మీద వచ్చే డబ్బులతో నిర్మాణ పనులు చేస్తూంటారు. ఇవి తగ్గిపోవడంతో నిర్మాణ పనులకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం గగనంగా మారుతోంది. మార్కెట్ పరిస్థితుల్లో బ్యాంకులు కూడా అంత వేగంగా స్పందించి నిధులు సర్దుబాటు చేయడం లేదు.
హైదరాబాద్‌లో రాజపుష్ప సంస్థ సమస్యపై చర్చ జరుగుతోంది. అయితే ఇది ఒక్క రాజపుష్ప సమస్య కాదని చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు. డిమాండ్ తగ్గడంతో లగ్జరీ ఇళ్ల నిర్మాణం భారంగా మారుతోంది. నిజానికి మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఇళ్లను ఈ బడా కంపెనీలు నిర్మించడం ప్రారంభిస్తే అసలు సమస్యే వచ్చేది కాదని అంటున్నారు.యాభై నుంచి అరవై లక్షల లోపు ఉండే ఇళ్లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. క్యాష్ ఫ్లో కూడా ఉండేదని చెబుతున్నారు. మొత్తానికి స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ సంక్షోభంలో పడుతున్నాయి. ఎప్పటికి కోలుకుంటాయో మరి…!