హైదరాబాద్‌ను మరింత మహానగరంగా విస్తరించే కీలకమైన ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ టెండర్ల దశకు వచ్చింది. ఉత్తరభాగం నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఇప్పటికే భూసేకరణ దాదాపుగా పూర్తి అయింది. ఈ ఉత్తరభాగం నిర్మాణ ఖర్చు కేంద్రం భరిస్తుంది. అందుకే టెండర్ల విషయంలో దూకుడుగా ఉన్నారు. పనులు కూడా మరో నెల రోజుల్లో ప్రారంభించాలని అనుకుంటున్నారు. దక్షిణ భాగం ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి భూసేకరణ జరుగుతోంది. ఆ నిర్మాణం కూడా కేంద్రం భరించాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. కేంద్రం సానుకూలంగా ఉందని చెబుతున్నారు.
ఇప్పుడు హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా. ఓఆర్ఆర్ నిర్మాణం తర్వాత ఎవరూ ఊహించని విధంగా హైదరాబాద్ విస్తరించింది. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటిన తర్వాత పది కిలోమీటర్ల వరకూ రియల్ వెంచర్లు ఏర్పడుతున్నాయి. బిజీగా మారుతూండటంతో .. రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణం మరో పదేళ్లలో పూర్తయినా అప్పటికి హైదరాబాద్ అంటే.. ట్రిపుల్ ఆరు లోపల ఉన్నదంతా అన్నట్లుగా మారిపోతుంది.
సంగిరెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ వరకూ హైదరాబాద్ లో కలిసిపోతుంది. అందుకే రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ అభివృద్ధికి ఓ గేమ్ ఛేంజర్ గా మారుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో టెండర్ల వరకూ రావడంతో ఇక పనుల్ని పరుగెత్తించాలని తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది.