తొలి ఇన్నింగ్స్ లో 190పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు ఓడిపోవడం చాలా అరుదు. ఇలాంటి అరుదైన టెస్ట్ మ్యాచ్ కి వేదికైయింది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ లో విజేతగా నిలిచింది ఇంగ్లాండ్ జట్టు. ఈ టెస్ట్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 246పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 436పరుగులు చేసింది. దీంతో 190పరుగుల ఆధిక్యం దొరికింది. అయితే సెకండ్ ఇన్నింగ్ లో ఇంగ్లీష్ జట్టు అనూహ్యంగా పంజుకుంది. ఏకంగా 420 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఆటగాడు ఒలీపోప్ 196 పరుగులతో జట్టుని ఆధిక్యంలో నిలబెట్టాడు.
231 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత జట్టు.. ఆరంభంలో నిలకడగా ఆడినట్లు కనిపించింది. అయితే ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే తన స్విన్ మాయాజాలంలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ని కూల్చేశాడు. 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో 202 పరుగుల వద్ద టీమ్ఇండియా చివరి ఇన్నింగ్ ముగిసిపోయింది. 28 పరుగులతో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. మొత్తానికి మన జట్టు సింపుల్ గా గెలుస్తుందని భావించిన మ్యాచ్ ని ఇంగ్లాండ్ ఎగరేసుకోపోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ లో విరాట్ లేడు. ఆ లోటు టాప్ ఆర్డర్ లో స్పష్టంగా కనిపించింది.