హైదరాబాద్: ఏ సమయంలోనైనా కరెన్సీని అందించే ఏటీఎమ్‌ల తరహాలో హైదరాబాద్ నగరంలో తాగునీటిని అందించే ఏటీఎమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఏటీఎమ్‌లలో రు.1కే లీటర్ తాగునీటిని అందించాలని యోచిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ఎండీ జనార్దనరెడ్డి నిన్న ఒక సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ఢిల్లీనగరంలో ఈ తరహాలో ఏటీఎమ్‌లను నిర్వహిస్తున్నారని, ఆ విధానాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లోనూ అమలు చేయాలని సూచించారు.
వేసవికాలం వస్తున్నందున ఈ ఎనీ టైమ్ వాటర్ కియోస్క్‌ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించి త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాలని జనార్దనరెడ్డి ఆదేశించారు. ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తే రూపాయి కాయిన్ వేసి లీటర్ నీటిని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలో అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా నీటిని అందుబాటులో ఉంచుతుంటాయి. అయితే అక్కడ నిర్వహణలోపం, ఇతర కారణాల నేపథ్యంలో ఎక్కువమంది అక్కడ నీళ్ళు తాగేందుకు ఇష్టపడరు. ప్రధాన రహదారులు, ఫుట్ పాత్‌లు విశాలంగా ఉన్నచోట్ల కియోస్క్‌లు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఢిల్లీలో ఉన్న కియోస్క్‌లలో రు.3కు 20 లీటర్ల నీటిని ఇళ్ళకు కూడా తీసుకెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు.