హైదరాబాద్లో అపరిమితంగా కేసులు పెరుగుతున్న కారణంగా మళ్లీ లాక్ డౌన్ ఆలోచనలు చేస్తోంది తెలంగాణ సర్కార్. కరోనా కట్టడిపై కేసీఆర్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకపోవడం వల్ల .. ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా.. రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. దీని వల్ల.. కరోనా వైరస్ విజృంభిస్తోందన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపించింది. దీంతో లాక్ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రారంభమయింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వారం లోపే.. లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అన్లాక్ 1 ప్రకటిచింది. రేపో మాపో అన్లాక్ 2 కింద మరిన్ని సడలింపులు ఇచ్చేఅవకాశం ఉంది. అయితే.. రాష్ట్రాల వారీగా చూస్తే.. అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో రాష్ట్రాలు స్వచ్చందగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. తమిళనాడులో చెన్నై సహా కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ పాటిస్తున్నారు. కర్ణాటకలోనూ కొత్తగా ఆంక్షలు విధించారు. ఉత్తరాది జిల్లాల్లో అసలు అన్ లాక్ సడలింపులు ఇవ్వని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్న కారణంగా.. కొన్ని ప్రభుత్వాలు.. సడలింపుల విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నాయి. కరోనాతో కలిసి జీవించాల్సిందేననే వాదన వినిపిస్తూ.. లైట్ తీసుకుంటున్నాయి.
తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసినప్పటికీ.. తర్వాత పూర్తిగా లాకులెత్తేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిపోయేవారికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఒక్క సినిమా హాల్స్ మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చేశారు. అయితే.. అనూహ్యంగా ఆ తర్వాతే కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. అటూ ఇటుగా ఇప్పుడు దాదాపుగా రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. అందులో 70 నుంచి 80 శాతం గ్రేటర్ పరిధిలోనే ఉంటున్నాయి. అందుకే.. కొన్నాళ్ల పాటు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.