ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభివృద్ధికో .. వినాశనానికో ఎవరికీ అర్థం కావడం లేదు. హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ఎంత మేర అభివృద్ధి చెందింతో కళ్ల ముందు కనిపిస్తూ నే ఉంది. ఈ క్రమంలో ఏపీలోనూ నిర్మించాలనుకున్న ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోద ముద్ర తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ కూడా ప్రారంభమయింది. కానీ జగన్ సర్కార్ బైపాస్ చాలని సరిపెట్టింది. కేంద్రం అడిగినంత భూమి ఇవ్వలేమని తేల్చేసింది. దీంతో ఇదే సందు అనుకున్న కేంద్రం… భారం పడకుండా లైట్ తీసుకుంది. కానీ జరిగిందేమిటో మాత్రం చెప్పింది.
ఇప్పుడు అదే హైదరాబాద్ చుట్టూ మరో ఔటర్ రింగ్‌రోడ్డుకు అక్కడి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్ రోడ్డును మరిపించే విధంగా 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ రీజనల్ రింగ్ రోడ్డు అంశంపై చర్చించారు. ఓ వైపు షాద్ నగర్, గజ్వేల్, సంగారెడ్డి, చౌటుప్పల్, భువనగిరిలను హైదరాబాద్‌లో కలుపుతూ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది.
ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. ఒక్కో అలైన్‌మెంట్‌కు మధ్య 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల తేడా ఉండేలా రూపొందించారు. ప్రస్తుతం అక్కడ అలైన్ మెంట్ రెడీ అవుతుంది. ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభమైతే.. హైదరాబాద్ మహా నగరాల్లోనే మహానగరంగా మారుతుంది. కానీ అలాంటి ముందు చూపు ఏపీ పాలకుల్లో కొరవడింది. కేంద్రం మంజూరు చేసినా.. తమకు అవసరం లేదన్నట్లుగా ఉన్నారు.